ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలకు భారీ ఊరటనిచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF)పై వ్యాట్ భారీగా తగ్గించింది. ఎటిఎఫ్‌పై వ్యాట్ 25 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ.. ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విమానాలను నడపడానికి జెట్ ఇంజన్లలో ఈ ఏటీఎఫ్‌ను ఉపయోగిస్తారు.
ఈ నిర్ణయంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేసే విమానయాన సంస్థలు.. ఈ వ్యాట్ తగ్గింపు కారణంగా ఇప్పటి నుండి తక్కువ ధరలను చెల్లించే అవకాశముంటుంది. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు ఏర్పడిన అంతరాయాల వల్ల విమానయాన సంస్థలు ఇప్పటికే భారీ జెట్ ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని నుంచి నడిచే విమానయాన సంస్థలపై ఈ నిర్ణయం పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపనుంది.
కాగా, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఏటీఫ్‌పై విధించే విలువ ఆధారిత పన్నును 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో అధిక శాతం ఉండటంతో ఈ పన్ను తగ్గింపు.. విమానయాన సంస్థలకు ఉపశమనంగా మారనుంది.
పెరుగుతున్న జెట్ ఇంధన ధరల వల్ల భారీ నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలకు ఈ నిర్ణయంతో భారం దిగనుంది. భారతీయ విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 35–40 శాతం కేవలం ఇంధనానికే ఖర్చవుతుంది. అందువల్ల విమానయాన రంగంలో ఇంధనమే భారీ భారంగా మారింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం విమానయాన సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో విమాన ఛార్జీల పెంపు.. కొన్ని మార్గాల రద్దుకు దారితీయవచ్చనే ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించినట్లయింది.


