 
													భగత్ సింగ్.. ఈ పేరు వినగానే ప్రతీ భారతీయునిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశ స్వాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్(Bhagat Singh) సహకారాన్ని ఎవరూ మరువలేరు. నేడు (మార్చి 23) భారతీయ యువతకు ఆదర్శప్రాయుడు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన భగత్ సింగ్ వర్ధంతి. 1931 మార్చి 23న భగత్‌సింగ్‌ను, ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
ఈ రోజును దేశంలో ‘అమరవీరుల దినోత్సవం’(Martyrs' Day)గా జరుపుకుంటారు. ఈ రోజున ఈ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం సంతోషంగా తమ ప్రాణాలను అర్పించారు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ (ఇప్పుడు పాకిస్తాన్)లోని లియాల్‌పూర్‌లో జన్మించారు. బాల్యం నుండే జాతీయ ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్ సింగ్ బ్రిటిష్ వారిపై తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేసేవాడు. స్వాతంత్ర్య సాధనకు అహింసా మార్గం ఒక్కటే సరిపోదని, విప్లవాత్మక కార్యకలాపాలు కూడా అవసరమని భగత్ సింగ్ నమ్మాడు.
భగత్ సింగ్ బ్రిటీష్ పాలను వ్యతిరేకిస్తూ 1929లో ఢిల్లీ అసెంబ్లీలో బాంబు విసిరారు. దీని లక్ష్యం ఎవరినీ చంపడం కాదు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే అలా చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భగత్‌సింగ్‌తో పాటు అతని అనుచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అరెస్ట్ చేశారు. తరువాత వారిని కోర్టుకు తరలించగా, అక్కడి వారు బ్రిటిష్ పాలన(British rule)కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం వారు ఉరిశిక్షను ఆనందంగా ఎదుర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.
వారి బలిదానం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశానిర్దేశం చేసింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. భారతదేశం 1947లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. మార్చి 23వ తేదీని అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. స్వేచ్ఛను సాధించడానికి పోరాటం మాత్రమే కాదు.. ధైర్యం, త్యాగం కూడా అంతే ముఖ్యమైనవని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజున అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. వారి పోరాటాన్ని గుర్తుచేసుకుంటారు. 
ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాలో బూడిదవుతున్న 20 అడవులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
