ధనికులపై సూపర్ ట్యాక్స్‌.. సీపీఎం మేనిఫెస్టో ఇదే.. | Sakshi
Sakshi News home page

ధనికులపై సూపర్ ట్యాక్స్‌.. సీపీఎం మేనిఫెస్టో ఇదే..

Published Fri, Apr 5 2024 7:54 AM

CPM manifesto super tax on rich scrap UAPA - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: రానున్న లోక్‌సభ ఎన్నికలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. UAPA వంటి క్రూరమైన చట్టాలను  రద్దు చేస్తామని, ధనికులపై "సూపర్ ట్యాక్స్"ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 

కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వామపక్ష పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ దశాబ్ద పాలన ద్వారా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీఎం పేర్కొంది.

సీపీఎం మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

  • ద్వేషపూరిత ప్రసంగం, నేరాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడతామని సీపీఎం హామీ ఇచ్చింది. CAA లేదా పౌరసత్వ (సవరణ) చట్టం- 2019ని రద్దు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
  • "చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి అన్ని క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఎంపేర్కొంది. స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
  • ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను పునఃపరిశీలించి, రివర్స్ చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సాధారణ సంపద పన్నుతో పాటు అత్యంత సంపన్నులపై పన్ను, వారసత్వపు పన్ను తప్పనిసరిగా చట్టబద్ధం చేస్తామని పేర్కొంది.
  • ప్రస్తుత లేబర్ కోడ్స్‌ స్థానంలో కార్మిక అనుకూల చట్టాలను రూపొందిస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మాదిరిగానే, సీపీఎం కూడా పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన నిబంధనను హామీ ఇచ్చింది.
  • 'పని చేసే హక్కు'ని రాజ్యాంగ హక్కుగా చేర్చేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పోస్టులలో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని,  ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడంతోపాటు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను రెట్టింపు చేస్తామని మేనిఫెస్టో పేర్కొంది.
  • పట్టణ ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చ‍ట్టం, నిరుద్యోగ భృతిపై సీపీఎం హామీ ఇచ్చింది.
  • విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో జీడీపీలో కనీసం ఆరు శాతానికి పెంచనున్నట్లు సీపీఎం పేర్కొంది. ఇది మొత్తం కేంద్ర పన్నుల వసూళ్లలో 50 శాతం రాష్ట్రాలకు అప్పగించడాన్ని సూచిస్తుంది.
  • తాము అధికారంలోకి వస్తే, ఒక ప్యానెల్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతిని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తారు. 
  • ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు సీపీఎం హామీ ఇచ్చింది. ఆదివాసీల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల పరిరక్షణపై వాగ్దానం చేసింది.
  • కుల ప్రాతిపదికన జనాభా గణన, రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలపై నిషేధం, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ తదితర అంశాలు సీపీఎం మేనిఫెస్టోలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement