హెచ్చరిక: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్‌ తీసుకోవద్దు

COVID-19 Patients On Home Care Should Not Take Remdesivir - Sakshi

ఎయిమ్స్‌ వైద్యుల హెచ్చరిక

ఆక్సిజన్‌ స్థాయి 94కు తగ్గితేనే ఆసుపత్రిలో చేరాలి

న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్‌ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఎయిమ్స్‌ డాక్టర్లు తెలిపారు. ‘హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు, జాగ్రత్తలు’ అనే అంశంపై ఎయిమ్స్‌ డాక్టర్లు నీరజ్‌ నిశ్చల్, మనీష్‌లు శనివారం ఒక వెబినార్‌లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షిస్తున్నపుడు పేషెంట్‌ వయసు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు.  

ఆర్టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినప్పటికీ... లక్షణాలు అలాగే కొనసాగితే మరోసారి టెస్టు చేయించుకోవాలి. 
ఐసోలేషన్‌ ఉన్నవారు మందులను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడితేనే ఉపయోగం ఉంటుంది. 
ఐసోలేషన్‌లో వాడే ఏ మందులైన డాక్టర్ల సలహా మేరకే వాడాలి. 
బీపీ, షుగర్, గుండెజబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 ఏళ్లకు పైబడిన పేషెంట్లు డాక్టర్లను సంప్రదించాకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. 
హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు తప్పకుండా మూడు పొరల మాస్క్‌ను వాడాలి, ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి దాన్ని మార్చాలి. 
ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితుల్లో పేషెంట్, సహాయకుడు ఇద్దరూ ఎన్‌–95 మాస్క్‌లు ధరించాలి. 
అజిత్రోమైసిన్‌ టాబెట్ల వాడొద్దని కోవిడ్‌ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top