దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ కష్టం

COVID-19: Herd Immunity Not An Option In A Country Like India - Sakshi

టీకాతోనే కరోనా కట్టడి సాధ్యం: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించవచ్చునని ఇన్నాళ్లూ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది.

టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్‌ భూషణ్‌ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘హెర్డ్‌ ఇమ్యూనిటీతో కరోనాని జయించవచ్చునని మన దేశం భావించడం సరైంది కాదు. అధిక జనసాంద్రత, సామాజిక ఆర్థిక పరిస్థితులతో ఒకేసారి దేశవ్యాప్తంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదు. ఒక్కో సమయంలో కొన్ని ప్రాంతాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. టీకాతో మాత్రమే కరోనాను జయించగలం’’అని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉండాలని రాజేష్‌ హితవు పలికారు.  

హెర్డ్‌ ఇమ్యూనిటీపై భిన్నాభిప్రాయాలు  
ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో ఎంత మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందితే హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చునన్న అంశంలో శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ చెప్పారు.

ఇటీవల జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా గతంలో ఉన్న అంచనాల కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నా హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చునని వెల్లడించింది. అయితే కోట్లలో జనాభా ఉన్న భారత్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యం అన్న అంశంలో శాస్త్రవేత్తలో ఏకాభిప్రాయం నెలకొని ఉంది. కాగా, భారత్‌ వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించాలనుకోవడం తప్పిదం అవుతుందని వైరాలజిస్టు జమీల్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో 70శాతం మందికి కరోనా సోకి వారిలో ఇమ్యూనిటీ పెరగాలని కోరుకోవడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని  హెచ్చరించారు.

ఒకే రోజు 52 వేల కేసులు
దేశంలో కరోనా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 52 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. ఇందులో 10 లక్షల మందికి పైగా కోలుకోగా, 5,28,242 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 52,123 కొత్త కేసులు వచ్చాయని, 775 మంది మరణించారని వెల్లడించింది. కోలుకునే వారి రేటు 64.44గా ఉండగా, మరణాల రేటు 2.21గా ఉంది. జూలై 29 వరకు 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది. బుధవారం మరో 4,46,642 కేసులను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.

10 లక్షల టెస్టులు చేస్తాం..
దేశంలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, రానున్న రెండు నెల్లలో ఆ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని భావిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ చెప్పారు. కరోనాతో పోరాడుతున్న శాస్త్రవేత్తలను, వైద్యులను ఆయన కొనియాడారు. 6 నెలల క్రితం భారత దేశం వెంటిలేటర్లను దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు సొంతగా మూడు లక్షల వెంటిలేటర్లు తయారు చేయగల స్థాయికి ఎదిగిందని చెప్పారు. అంతేగాక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ తయారీలో సైతం భారత్‌ ఇతరదేశాలతో పోటీ పడుతోందని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top