సాక్షి, బెంగళూరు(యశవంతపుర): నా భర్త కస్టమ్స్ అధికారి అని, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని ఇప్పిస్తామని, అక్కడ అధికారులు సీజ్ చేసిన వస్తువులను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న జంట కటకటాల పాలైంది. దర్బిన్‌దాస్ అలియాస్ మోహన్‌దాస్, అతని భార్య ధనుష్యను కొడిగేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 34 లక్షల నగదు, 106 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అనూప్‌శెట్టి తెలిపారు.
వివరాలు... ఇందిరానగరలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్ద ధనుష్య శిక్షణకు చేరింది. తన భర్త విమానాశ్రయంలో కస్టమ్స్‌లో పని చేస్తున్నట్లు చెప్పింది. జప్తు చేసిన బంగారు నగలను తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించింది. అలా స్నేహ నుంచి పలు విడతలుగా రూ. 68 లక్షలను నగదును వసూలు చేసింది. అంతేకాక అకాడమీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తరువాత ధనుష్య మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో బాధితులు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: (మోసకారి దంపతులు దర్బిన్‌దాస్, ధనుష్య)
పలువురి నుంచి వసూళ్లు
దేవనహళ్లి తాలూకాలో కూడా ఇదే తరహా మోసం కేసు వీరిపై నమోదై ఉంది. ధనుష్య పిల్లలు చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుందని పోలీసుల విచారణలో బయట పడింది. తక్కువ ధరలకు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లభిస్తాయని చెప్పుకొని నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లోని వారి నుంచి లక్షల రూపాయలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకుంది.
వస్తువులన్నీ ఇప్పించండి, లేదా డబ్బయినా తిరిగి ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేయడంతో ధనుష్య, ఆమె భర్త మంగళూరుకు పారిపోయారు. కొడిగేనహళ్లి పోలీసులు మంగళూరుకు వెళ్లి ఈ జంటను పట్టుకుంది. వారి ఇంట్లో రూ. 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment