ఇలా కూడా కరోనా వస్తుందంటే.. నమ్మలేం!

Coronavirus Can Spread Through Toilet Pipe - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పలు అంతస్థులు గల అపార్ట్‌మెంట్‌లో ఏ ఒక్కరికి కరోనా వైరస్‌ సోకినా అపార్ట్‌మెంట్‌ వాసులందరికి స్వీయ నిర్బంధం విధించి అందరికి వైద్య పరీక్షలు చేసిన సంగతులు మనం ఎన్నో విన్నాం. అలా ఎందుకు చేసే వారంటే కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి లిఫ్ట్‌ ద్వారా రాకపోకలు సాగించడం వల్ల, అదే లిఫ్ట్‌లో రాకపోకలు సాగించే ఇతరులకు వచ్చే అవకాశం ఉందని లేదా కరోనా సోకినా వ్యక్తితో చనువుగా ఉన్న ఇతరులకు కూడా కరోనా వైరస్‌ వచ్చే ఆస్కారం ఉందన్న కారణంగా నిర్బంధ వైద్య పరీక్షలు జరిపే వారు. చైనాలోని ఓ అపార్ట్‌మెంట్‌ విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకింది. (వెంటాడుతున్న కరోనా ఫోబియో..!)

గ్వాంజౌ నగరంలోని ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. వారి కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న ఇరువురు దంపతులకు కరోనా వైరస్‌ సోకింది. వారు ఏనాడు ఒకరినొకరు కలసుకున్నది లేదు. కనీసం మొహామొహాలు చూసుకున్నదీ లేదు. కరోనా వైరస్‌ సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్‌లు కూడా 25, 27 అంతస్తుల్లో ఉంటున్న వద్ధ దంపతులు ఉపయోగించలేదు. పని మనుషుల ద్వారా వచ్చి ఉండవచ్చునుకుందామంటే ఆ రెండు అపార్ట్‌మెంట్లలో పని మనుషులు కూడా లేరు. కనీసం కొన్ని నెలలుగా ఆ రెండు అంతస్తుల వారు బయటకు కూడా రాలేదు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు)

మరి ఆ రెండు జంటలకు కరోనా ఎలా సోకింది? వైద్య నిపుణులకు ముందుగా ఏం అర్థం కాక తలలు బద్ధలు కొట్టుకున్నారు. ఎలాగైనా ఈ రహస్యాన్ని ఛేదించాలనే కృతనిశ్చయంతో వైరస్‌ను గుర్తించే మైక్రో లెన్స్‌లను పట్టుకొని 15వ అంతస్తులోన్ని అన్ని గదులను శోధించారు. అందులోని మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లోని వాష్‌రూమ్‌ కమోడ్‌లో కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపించింది. కమోడ్‌ నుంచి ఆపార్ట్‌మెంట్‌ వెలుపలి నుంచి వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్‌లోనూ కరోనా వైరస్‌ కనిపించింది. అదే పైప్‌ లైన్‌ వెంట వైద్య నిపుణులు పరిశీలిస్తూ పోగా, 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో ఓ మోస్తారుగా, 25,27 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో తీవ్ర స్థాయిలో కరోనా వైరస్‌ కనిపించింది. 15వ అంతస్తులో కరోనా సోకిన వ్యక్తుల నుంచి టాయ్‌లెట్‌ గ్యాస్‌ పైప్‌ ద్వారా కరోనా వైరస్‌ 25, 27 అంతస్తుల్లోని దంపతులకు వైరస్‌ సోకినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌లో కూడా వైరస్‌ కనిపించినందున వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

కమోడ్‌ గ్యాస్‌ పైప్‌ నుంచి కరోనా వైరస్‌ ‘బయో ఎయిరోసోల్స్‌’ రూపంలో బయటకు వస్తుందని, గాలిలో వైరస్‌ 30 నిమిషాలపాటు జీవించి ఉంటుందని, టాయ్‌లెట్స్‌కు సరైన వెంటిలేషన్‌ ఉండి, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉన్నట్లయితే అర నిమిషంలో సగం వైరస్, నిమిషంలో పూర్తి వైరస్‌ బయటకు వెళ్లిపోతుందని నిపుణులు తెలిపారు. రెండు అంతస్తుల్లోని వద్ధ దంపతులు బాత్‌రూమ్‌ వెంటిలేటర్లను తెరవక పోవడం వల్ల, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను అసలు వాడక పోవడం వల్ల వారి బాత్‌రూమ్‌లో వైరస్‌ ఎక్కువ కాలం ఉండి ఉంటుందని, తద్వారా వారికి సోకి ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 15వ అంతస్తులోని కుటుంబ సభ్యులు కరోనా ఆవిర్భవించిన ‘వుహాన్‌’ పట్టణం నుంచి కొంతకాలం క్రితమే వచ్చారట. అక్కడ వారు వైరస్‌ బారిన పడి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top