కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ

Corona Vaccine: Central Government Releases Myths About Corona Vaccination - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాపంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియపై రకరకాల అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ విడుదల చేసింది. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని తెలిపింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు, చర్చలు జరిగాయని పేర్కొంది.

అంతర్జాతీయంగా కొనుగోళ్లు అంత సునాయాసమేమీ కాదని, అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల కంపెనీలు తమ ప్రాధాన్యత తాము నిర్ణయించుకున్నాయని చెప్పింది. రష్యాలోని స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కి క్లినికల్ ట్రయల్స్ అనుమతులు, దిగుమతులు వేగంగా జరిగాయని, అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలను భారత్‌లో తయారుచేసి, ఇక్కడి మార్కెట్‌కు అందించి, ఆ తర్వాత ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నామని వివరించింది.

ఇతర దేశాల వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి ఇవ్వలేదన్న వార్తలు కూడా నిజం కాదని అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతిస్తూ ఏప్రిల్‌లోనే ప్రకటన జారీ చేశామని గుర్తుచేసింది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని, కోవాక్సిన్ నెలకు 1కోటి డోసుల ఉత్పత్తి  సామర్థ్యం నుంచి అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపింది.

కోవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసుల నుంచి 11కోట్ల డోసులకు పెరగనుందని, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ సమన్వయంతో మరో 6 కంపెనీల్లో ఏకకాలంలో ఉత్పత్తి చేయనుందని పేర్కొంది. జైడస్ క్యాడిలా, బయోలాజికల్-ఈ, జెన్నోవా సంస్థల దేశీయ వ్యాక్సిన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వివరించింది.

కంపల్సరీ లైసెన్సింగ్ అనేది సాధ్యపడే అంశం కాదు
ఇందుకు అవసరమైన మానవ వనరుల తయారీ, శిక్షణ, బయోసేఫ్టీ ల్యాబొరేటరీలు వంటి అనేకాంశాలు ఇందులో మిళితమై ఉంటాయని, టెక్నాలజీ బదిలీ ద్వారా ఇప్పటికే భారత్ బయోటెక్ మరో 3 సంస్థలతో కలిసి కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. మోడెర్నా సంస్థ 2020లోనే తమ వ్యాక్సిన్లను ఇంకెవరు తయారు చేసినా కేసులు వేయబోమని చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఎవరూ చేయలేకపోయారు. లైసెన్సింగ్‌తో మాత్రమే ఇది సాధ్యపడదని పేర్కొంది. వ్యాక్సిన్ల తయారీ అంత సులభమైన అంశమైతే అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించింది.

మరికొన్ని అంశాలు:
వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుని రాష్ట్రాలకు వదిలేయలేదు.
రాష్ట్రాల అభ్యర్థన మేరకే వ్యాక్సిన్ల సేకరణ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాం.
ప్రపంచంలో ఏ దేశంలోనూ చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటి వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదు.
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేసే ప్యానిక్ సమాచారం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ అంశాన్ని నిర్ణయంచలేము.
రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలనుకుంటారు. వ్యాక్సినేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, నిపుణులు అని కేంద్రం గుర్తు చేసింది.
చదవండి: CoronaVirus: మన కాక్​టెయిల్​ ట్రయల్స్​​కి పర్మిషన్​

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top