కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతలు తన్నుకున్నారు

Congress Workers Attack Puducherry Dinesh Gundu Rao Car - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ శ్రేణులు రోడ్డెక్కి నిరసనకు దిగాయి. వివరాలు.. పుదుచ్చేరి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అధికారం చేజారిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా పార్టీని నెట్టుకొస్తున్న నారాయణస్వామిపై నిరసన మేఘాలు కమ్ముకున్నాయి. 

పార్టీని బలోపేతం చేస్తూ, నిరసన నిప్పును ఆర్పివేసేలా పుదుచ్చేరి కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కావాలని రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన పుదుచ్చేరికి చేరుకున్నారు. అప్పటికే సమావేశం కోసం గుమికూడిన ఇరువర్గాలు బాహాబాహాకి దిగాయి. ఈ సమయంలో దినేష్‌ గుండూరావు సమావేశం ప్రాంగణానికి చేరుకోగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. 

గుండూరావు కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సమావేశం హాలులోకి వెళ్లకుండా గుండూరావుకు పార్టీ శ్రేణులు చుక్కలు చూపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లురువ్వారు. పుదుచ్చేరి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నారాయణస్వామిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇక కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి భౌతిక దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ సీఎం నారాయణ స్వామి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top