Bharat Jodo Yatra: అడుగులో అడుగేస్తూ..

Congress President Sonia Gandhi joins Bharat Jodo Yatra in Mandya - Sakshi

రాహుల్‌ వెంట పాదయాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ

కరోనా నుంచి కోలుకున్నాక తొలిసారిగా ప్రజల మధ్యకు..

పాండవపుర: కర్ణాటకలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ భారత్‌ జోడోయాత్రలో గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాలుపంచుకున్నారు. కుమారుడు రాహుల్‌ గాంధీతో కలిసి అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగారు. అనారోగ్యంలో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనియా చాలారోజుల తర్వాత ప్రజలకు దర్శనమిచ్చారు. ఆమె గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా 2016 ఆగస్టులో వారణాసిలో ఓ రోడ్డుషోలో పాల్గొన్నారు.

పార్టీ అధినేత్రి ఆగమనం పట్ల పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు. వారిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మాండ్యా జిల్లాలోని జక్కనహళ్లి, కరాడ్యా పట్టణాల మధ్య రాహుల్‌ వెంట కొన్ని కిలోమీటర్ల మేర సోనియా వడివడిగా అడుగులు వేశారు. ఈ అరుదైన ఘట్టానికి ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ మంచి స్పందన లభించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాహుల్, సోనియాతో పాదయాత్రలో పాల్గొన్నారు.

గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పెనుగాలులకు ఎదురొడ్డి నిలిచామని, సవాళ్లకు ఉన్న పరిమితులను బద్దలు కొడతామని రాహుల్‌ పేర్కొన్నారు. అందరం కలిసి దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఆశయమని ట్వీట్‌ చేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని వివరించారు. పాదయాత్రలో తన తల్లి సోనియా గాంధీ భుజాలపై తాను చేతులు వేసిన చిత్రాన్ని పోస్టు చేశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ పార్టీ షేర్‌ చేసింది. వారికి ప్రేమే రక్షణ కవచమని పేర్కొంది.  

తల్లి పూజ్యనీయురాలు  
భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా భుజాలపై చేతులు వేసి రాహుల్‌ నడవడం అందరి దృష్టిని ఆకర్శించింది. పాదయాత్రలో నడుస్తుండగా సోనియా బూట్ల లేసులు ఊడిపోయాయి. రాహుల్‌ వెంటనే కిందకు వంగి వాటిని గట్టిగా బిగించికట్టారు. ఈ చిత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్‌ స్పందించారు. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అమ్మంటే అమ్మే అని పేర్కొన్నారు. తల్లి పూజ్యనీయురాలు అంటూ సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

యాత్రలో సోనియాను చూసేందుకు జనం బారులుతీరారు. ఆమె వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాహుల్‌ సైతం ప్రజలతో కరచాలనం చేశారు. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం సోనియా కేవలం 30 నిమిషాలపాటు యాత్రలో పాల్గొనాలి. కానీ, రెండు గంటలకుపైగానే భాగస్వాములు కావడం విశేషం. భారత్‌ జోడో యాత్రతో సోనియా మమేకమయ్యారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌చేశారు.  యాత్ర ముగిశాక సోనియాగాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top