రాహుల్‌ అనర్హతవేటు: ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్‌ సమావేశం, న్యాయపోరాటంతో పాటుగా..

Congress Party Key Meet After Rahul Gandhi Disqualification - Sakshi

సాక్షి,  ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ విస్తృత సమావేశంలో రాహుల్‌ గాంధీ అనర్హత వేటు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రధానాంశంగా ఈ చర్చ నడిచినట్లు తెలుస్తోంది.  

ఈ కీలక భేటీలో.. మూడు విధాలుగా పోరాడాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవైపు న్యాయపోరాటంతో పాటు మరోవైపు  దేశవ్యాప్తంగా వీధుల్లోనూ పోరాడాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ పోరాటంలో విపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించింది. అదే సమయంలో రాహుల్‌కు సంఘీభావంగా పలు రాష్ట్రాల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు ప్రణాళిక రచిస్తోంది. ఇక.. కార్యాచరణపై రేపు(శనివారం) స్పష్టమైన ప్రకటన చేయనుంది ఏఐసీసీ.    

ఈ భేటీకి ఖర్గే, సోనియాగాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, రాజీవ్‌ శుక్లా, తారీఖ్‌ అన్వర్‌, సీనియర్లు ఆనంద్‌ శర్మ, అంబికా సోనీ, ముకుల్‌ వాన్షిక్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, పవన్‌ కుమార్‌ బన్సాల్‌ తదితరులు హాజరయ్యారు. 

పరువునష్టం దావాకు సంబంధించి రాహుల్‌గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించి.. ఆ వెంటనే బెయిల్‌, నెలలోపు అప్పీల్‌ చేసుకునేందుకు వీలు ఇచ్చింది. దీంతో రాహుల్‌ గాంధీ ఇవాళ(శుక్రవారం) కూడా కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం కోసం పార్లమెంట్‌కు వెళ్లారు.  అయితే ఈలోపే లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటేస్తూ లోక్‌సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top