
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాపాడుతోంది
‘సిందూర్’ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం తెలిసిపోయింది
కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం
దేశ ప్రయోజనాలను ఏనాడూ కాపాడలేదు
నేను శివ భక్తుడిని.. నన్ను ఎవరు ఎంతగా తిట్టినా భరిస్తా
అస్సాంలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి
గౌహతి: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.
ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి, నుమాలీగఢ్‌లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...
తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు
‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు.
1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్‌ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్‌కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి.
‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’
అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం.
‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం
కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే.
దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి
ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.
ఆ గరళం గొంతులో దాచుకుంటా
నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి.
మోదీకి బహుమతిగా పెయింటింగ్‌లు
అస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్‌లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్‌లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.
రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు
ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.