కరోనాతో ఎంపీ వసంతకుమార్‌ కన్నుమూత  | Sakshi
Sakshi News home page

కరోనాతో ఎంపీ వసంతకుమార్‌ కన్నుమూత 

Published Sat, Aug 29 2020 8:24 AM

Congress MP Vasanthakumar Departed Due To Coronavirus - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్‌.వసంతకుమార్‌ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. (చదవండి : ఎంపీలకు కరోనా పరీక్షలు)

2019లో కన్యాకుమారి నుంచి లోక్‌సభకు ఎన్నికైన వసంతకుమార్‌... అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. హరికృష్ణ పెరుమాళ్, తంగమాళ్‌ దంపతులకు 1950 ఏప్రిల్‌ 14న జన్మించిన వసంతకుమార్‌ తొలుత ఒక చిన్నపాటి దుకాణంతో వ్యాపారంలోకి అడుగుపెట్టారు.  అంచలంచెలుగా ఎదుగుతూ వసంత్‌ అండ్‌ కో పేరున ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ షోరూంను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 64 శాఖలను నిర్వహిస్తోంది. తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి వసంతకుమార్‌ దగ్గరి బంధువు. వసంతకుమార్‌ మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి
ఎంపీ వసంతకుమార్‌ అకాల మరణంపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీగా కన్యాకుమారితో పాటు తమిళనాడు అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తిండిపోతుందన్నారు.

Advertisement
Advertisement