మాజీ మంత్రిపై రూ.1,500 కోట్ల కమీషన్‌ పొందినట్లు ఫిర్యాదు 

Complaint File On SP Velumani Over He Takes 1500 Crore Allegations In Coimbatore - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థికనేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. కోయంబత్తూరు రేస్‌కోర్స్‌ ప్రాంతానికి చెందిన డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్‌కోర్స్‌’ రఘునాథ్‌ కోవై ఆర్థికనేరాల విభాగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్, కోవైలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. కోయంబత్తూరు కార్పొరేషన్‌లో రూ.1,500 కోట్ల అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి.

బిల్లూరు 3వ అభివృద్ధి పథకం కింద సొరంగ మార్గం నిర్మాణానికి రూ.116 కోట్ల కేటాయింపు జరిగి పనులు జరుగుతున్నాయి. నొయ్యాల్‌ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్‌కోర్సు స్మార్ట్‌ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది. ఇలా జరిగే అన్నిపనుల్లోనూ మంత్రి తనవాటాగా 12 శాతం కమీషన్‌ పొందడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top