నాగ్‌పూర్: తన నానమ్మ మరణవార్త తెలిసిన సమయంలోనూ ఢిల్లీ పోలీసులు తనకు ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. తన నానమ్మతో గ్రామంలో కలిసి నివసించే బంధువుకు ఫోన్ చేసి ఆమెకు ఏమైందో తెలుసుకోవాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదని చెప్పారు. అంతేకాకుండా, తాను అరెస్టయిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు కోరారని, ఆ సమయంలో వారిని నిద్రలేపి ఆ వార్త చెప్పాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ పోలీసులు తన వద్దకు వచ్చి నానమ్మ ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు తెలిపారని దీప్కే వెల్లడించారు. వెంటనే గ్రామంలో ఆమెతో కలిసి నివసించే తన బంధువుకు ఫోన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఫోన్‌ను కేవలం 2 నిమిషాలు ఇవ్వాలని అడిగినా పోలీసులు నిరాకరించారని ఆరోపించారు. బంధువు ఫోన్ నంబరు గుర్తులేదని, తన ఫోన్ ఇస్తే అందులో చూసి నంబరు చెబుతానని వివరించినా అంగీకరించలేదన్నారు.
పోలీసులు పట్టించుకోలేదు
చట్టప్రకారం తన న్యాయవాదికి ఫోన్ చేసే హక్కు కూడా తనకు ఉందని, అయితే ఆ అవకాశం సైతం పోలీసులు కల్పించలేదని దీప్కే ఆరోపించారు. నానమ్మకు ఏమైందో, ఆమె ఎలా మరణించిందో తెలుసుకోవడానికి బంధువుతో మాట్లాడాల్సి ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తాను అరెస్టయినట్లు రోజంతా తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, తెల్లవారుజామున 3.30 గంటలకే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని పోలీసులను ప్రశ్నించినట్లు తెలిపారు.
అది చట్టపరమైన ప్రక్రియ అని వారు సమాధానమిచ్చారని దీప‍్కే చెప్పారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి కుమారుడి అరెస్టు గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నానమ్మ మరణంతో తన తల్లిదండ్రులు అప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారని, అలాంటి సమయంలో అరెస్టు వార్తతో వారిని మరింత బాధకు గురిచేయడం అమానవీయమని విమర్శించారు.
“వారికి మానవత్వం లేదు. యూనిఫాం ధరించిన గూండాల్లా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా వారిని అలా తయారుచేశారు” అని దీప్కే తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని తెలిపిన ఆయన, మరోసారి వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. “అమిత్ షా, మోదీ వంటి వారి బెదిరింపులకు భయపడేది లేదు. వందసార్లు జైలుకు పంపినా భయపడం. మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతాం” అని హెచ్చరించారు.


