మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు.. హాట్‌ టాపిక్‌గా సీఎం కామెంట్స్‌

CM Nitish Kumar Called The People Who Consume Liquor As Mahapaapi - Sakshi

పాట్నా: మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదంట.. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ స్వయంగా ఓ రాష్ఠ్ర ముఖ‍్యమంత్రే అనడం ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరంటే..

బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ సవరణలు చేశారు. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్‌ చేసి బెయిల్‌ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా తీవ్ర గందరగోళం నెలకొంది. 

ఈ సందర్బంగా సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మద్యం సేవించే వారు అసలు భారతీయులే కాదన్నారు. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించను అని వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. 2021లో చివరి ఆరు నెలల్లో మద్యం కారణంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. బీహార్‌లో 14-15 మంది పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద చేసిన అరెస్టులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌లను మాత్రమే విచారించడంతో బీహార్‌లోని న్యాయవ్యవస్థ పనితీరుపై మద్యం చట్టం ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top