
పెండింగ్ కేసులపై కోర్టులు నిందలు పడాల్సి వస్తోంది
సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆవేదన
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది.
సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్‌లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది.
సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్‌లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్‌లు పనిచేసేవి.
సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది.