ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..

Chhattisgarh: 11-year-old Rahul rescued after 104 hours from borewell - Sakshi

బోరుబావిలో అయిదు రోజుల తర్వాత సురక్షితంగా బయటకి

మానసిక వికలాంగుడైనా పోరాటపటిమ ప్రదర్శించిన బాలుడు రాహుల్‌ సాహు

జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి,  68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ  పడిపోయిన రాహుల్‌ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్‌ గ్రామంలో రాహుల్‌ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్‌కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్‌ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్‌ కప్పి ఉంచారు. రాహుల్‌ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్‌ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు.

విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం రాహుల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్‌ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top