పోలీసులతో ఆడుకున్న ఐటీ ఉద్యోగిని.. ప్రియుడి కోసం హైడ్రామా? 

Chennai Woman Who Dramatized Sexual Assault For Her Boyfriend - Sakshi

ఐటీ ఉద్యోగిని గుట్టురట్టు 

పోలీసులను పరుగులు తీయించిన ఫిర్యాదు 

సీసీ కెమెరాల ద్వారా వెలుగులోకి యువతి బాగోతం  

సాక్షి, చెన్నై: ప్రేమించిన ప్రియుడిని దక్కించుకునేందుకు ఓ యువతి రచించిన లైంగిక దాడి నాటకం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాత్రంతా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండాచేసింది. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లాపాలవాక్కం పరిధిలో శనివారం రాత్రి ఓ యువతి రక్తగాయాలైన స్థితిలో పరుగులు తీస్తూ ఓ ఇంట్లోకి చొరబడింది. తనపై నలుగురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడి చేసినట్లు ఆ యువతి పేర్కొనడంతో ఆ ఇంట్లో ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. చెంగల్పట్టు రైల్వే స్టేషన్‌ నుంచి తనను కిడ్నాప్‌ చేసినట్లు ఆ యువతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అడ్డంగా బుక్కైంది. ఆ యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చెంగల్పట్టు రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే సమయంలో యువతిపై సామూహిక లైంగిక దాడి సమాచారం మీడియాల్లో హల్‌చల్‌ కావడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రాత్రంతా గాలించారు. 

అడ్డంగా బుక్కైంది.. 
చెంగల్పట్టు రైల్వే స్టేషన్‌ నుంచి ఆ యువతి ఓ యువకుడితో మోటారు సైకిల్‌పై వెళ్తున్న దృశ్యం ఓ చోట సీసీ కెమెరాలో కనిపించింది. ఉత్తర మేరు వైపుగా వెళ్లడం, కాసేపటికి లైంగిక దాడి జరిగినట్లు పాలవాక్కంలో ఆమె పరుగులు తీయడం పోలీసుల్లో అనుమానాల్ని రెకెత్తించాయి. ఆ యువతి కొందరు యువకుల పేర్లను విచారణలో వెల్లడించడంతో వారి సెల్‌ నంబర్లను పోలీసులు ట్రాప్‌ చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకులు కన్యాకుమారి, మదురై, ఉత్తర చెన్నై పరిధిలో ఉండటంతో  మరింత అనుమానాలు నెలకొన్నాయి. సంఘటన జరిగిన సమయం నుంచి ఆ యువకులు కన్యాకుమారి, మదురైకు వెళ్లాలంటే, కనీసం ఏడెనిమిది గంటలు పట్టే అవకాశం ఉంది. 

దీంతో మోటారు సైకిల్‌పై వెళ్లిన యువకుడు సలీంను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ యువతి రచించిన నాటకం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగిగా ఉన్న ఆ యువతి సలీం అనే యువకుడిని ప్రేమించింది. మూడు నెలలుగా ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నాయి. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సలీంపై ఆమె ఒత్తిడి పెంచింది. సలీం దాట వేస్తూ రావడంతో అతడిని దక్కించుకునేందుకు లైంగిక దాడి పేరిట, సలీంతో పాటు అతడి మిత్రులను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. ఆదివారం ఆమెను ఆసుపత్రి నుంచి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సలీంను కూడా ప్రశ్నిస్తున్నారు. కాంచీపురం ఎస్పీ సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ, ఆ యువతి నాటకం గురించి వివరించారు. ఆ యువతి ఇచ్చిన ఆధారంగా నలుగురు యువకుల పోన్‌లను ట్రాప్‌ చేయగా, వారంతా వేరువేరు చోట్ల ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో అనుమానం వచ్చి విచారించడంతో యువతి నాటకం బయటపడిందని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top