
కుటుంబంతో సహా డాక్టర్ ఆత్మహత్య
తిరుమంగళంలో కలకలం
సాక్షి, చెన్నై: ఆయన డాక్టరు, ఆమె న్యాయవాది. వీరికి ఇద్దరు పిల్లలు..ఎంతో ఆనందకరంగా ఉన్న వీరి జీవితాన్ని అప్పులు కాటేశాయి. అప్పులు రూ. 5 కోట్లకు చేరడంతో చెల్లించ లేని పరిస్థితులలో జీవితాన్ని కుటుంబం అంతా ముగించేశారు. చెన్నై తిరుమంగళంలో గురువారం ఉదయం ఈఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. చెన్నైలో అన్నానగర్, తిరుమంగళం పరిధిలోని 17వ క్రాస్ స్ట్రీట్‌లోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ ప్లాట్‌లో డాక్టర్ బాలమురుగన్ (52) కుటుంబం నివాసిస్తూ వచ్చింది.
ఆయన భార్య సుమతి (47) హైకోర్టులో న్యాయవాది. ఈ దంపతులకు జశ్వంత్‌కుమార్ (19), లింగేశ్‌కుమార్(17) కుమారులు. పెద్దవాడు ప్లస్–2 ముగించి డాక్టరు కావాలన్న కలతో నీట్‌కు సిద్ధమవుతున్నాడు. రెండవ వాడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. బాల మురుగన్‌కు అన్నానగర్‌లో రెండు, రెడ్ హిల్స్‌లో ఒకటి అంటూ పలు చోట్ల స్కాన్ సెంటర్లు ఉన్నాయి.
రుణాలు అధికమై..
గురువారం ఉదయం బాలమురుగన్ డ్రైవర్ విజయ్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకు డాక్టర్ తెరవక పోవడంతో పక్కన ఉన్న ప్లాట్‌ల వారి సహకారంతో వారి బంధువులకు సమాచారం అందించాడు. వారు తిరుమంగళం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, పోలీసులు ఆ ప్లాట్‌కు చేరుకుని తలుపు పగల కొట్టి వెళ్లి చూడగా ఓ గదిలో ఒకే ఫ్యాన్‌కు సుమతి, చిన్న కుమారుడు లింగేశ్వర్ ఉరివేసుకుని మృత దేహాలుగా బయటపడ్డారు.
మరో గదిలో వేర్వేరు ఫ్యాన్‌లకు బాల మురుగన్, పెద్దకుమారుడు జశ్వంత్‌కుమార్ మృతదేహాలుగా వేలాడుతుండటంతో కలకలం రేగింది. వీరి ఆత్మహత్య సమాచారంతో ఆ పరిసరాలలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్కాన్ సెంటర్‌లలో పనిచేసే సిబ్బంది ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. కన్నీటి పర్యంతమయ్యారు.
తమను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, సకాలంలో, నిర్ణీత సమయంలో జీతాలను ఇస్తూ, ఆదరిస్తూ వచ్చిన యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినపోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. విచారణలో స్కాన్ సెంటర్ల విస్తరణ కోసం రూ. 5 కోట్ల వరకు అప్పులు చేసినట్టు వెలుగు చూసింది. నెలకు రూ.5 లక్షల వరకు ఈఎంఐలు కడుతుండటం, మరికొందరికి వడ్డీలు చెల్లిస్తుండటం వెలుగు చూసింది. ప్రస్తుతం వడ్డీ చెల్లించ లేని పరిస్థితులలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగినట్టు గుర్తించారు.
అప్పులు కట్ట లేని పరిస్థితులలో తీవ్ర మనోవేదనతో ఉన్న డాక్టర్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో సుమతి, చిన్నకుమారుడు ఒకే ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఉండటంతో వారిని హతమార్చి, ఆతర్వాత పెద్దకుమారుడిని ఉరివేసి హతమార్చి, చివరకు డాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment