డీఎంకేను గద్దె దించడమే లక్ష్యం
సేలం: ప్రజా వ్యతిరేక డీఎంకే పాలనను అధికారం నుంచి తొలగించి టీవీకేను అధికారంలోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రజల లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. 2026లో వందకు వంద శాతం టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ప్రేమించే ఈ విజయ్ కావాలా..? ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపే స్టాలిన్ ..కావాలా తేల్చుకునే ఎన్నికలే త్వరలో జరగనున్నట్టు వ్యాఖ్యలు చేశారు. సేలంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. ఇందులో ఐదు వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా, విజయ్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. పాస్‌లు లేని వాళ్లు సైతం దూసుకొచ్చేయడంతో కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు భానుడు భగ భగ మండుతుంటే, మరో వైపు విజయ్ వేదికపై వాడివేడిగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు. కాగా, ఈ సభకు వచ్చిన ఉత్తరాదికి చెందిన, స్థానికంగా వెండి తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న సూరజ్(37) స్పృహ తప్పి మరణించడం విషాదానికి దారి తీసింది.
ప్రజారక్షకుడిని
తమిళనాడుకు మొదటి సైనికుడిగా, మొదటి రక్షకుడిగా నిలబడడమే తన లక్ష్యం అని పేర్కొంటూ, తాను అందరి నుంచి ఓట్లు అడగడానికి రాలేదని, అందరిని న్యాయం అడగడానికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. నేను ఏం తప్పు చేశాను? రాజకీయాల్లోకి రావడం తప్పా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలకు కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి, స్థలం ఇస్తారని, అయితే, తనకు మాత్రమే ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకున్న సొమ్ముతో ఓటర్లను కొనేయ వచ్చు అని కలలు కంటున్నారని, వారు ఇచ్చే నోట్లు తీసుకుని వారి చెవులలో ఘీంకరించే విధంగా విజిల్ మోత మోగించాలని పిలుపునిచ్చారు. . తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని, ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తమను ఏ టీమ్, బీ టీమ్ అని పిలుస్తున్నారని, తనకు ఇందులో ఎలాంటి అనుభవం లేదని పేర్కొంటూ, పొత్తులపై ఆధారపడిన 75 ఏళ్లుగా ఒకరు, 50 ఏళ్లగా మరొకరు కదన రంగంలోకి వస్తుంటే, ఈ విజయ్ ఒంటరిగా నిలబడి ఢీకొట్ట బోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కలలను వినేందుకు సీఎం పథకాన్ని ప్రకటించారని గుర్తు చేస్తూ, డీఎంకే గద్దె దించడమే ప్రజల కల, టీవీకేను అధికారంలోకి తీసుకు రావడమే ప్రజల కల అని వ్యాఖ్యల తూటాలను పేల్చారు. అధికారంలో వాటా, అధికారంలో భాగస్వామ్యం, సంకీర్ణం అంటూ తాను చేసిన వ్యాఖ్యలు తాజాగా సీఎం స్టాలిన్‌ను తీవ్ర సంకటంలో పడేసి ఉందంటూ , మరిన్ని షాక్‌లు త్వరలో సీఎంకు ఇవ్వనున్నామన్నారు.
మనం ఏమిటో నిరూపించుకుందాం
విజయ్ మాట్లాడుతూ మనల్ని మనం నిరూపించుకోవాలనే తపన అందరిలో పెరగాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ఇతరులకు ఒక రాష్ట్రం కావచ్చునని, అయితే, తనకు మాతృభూమి తమిళనాడు, తన ఇంట్లో 8 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. తనకు అన్నీ ఇచ్చిన తమిళనాడును అన్నింటా ఉన్నత స్థానంలో ఈ విజయ్ నిలబెడతాడని ధీమా వ్యక్తం చేశారు.
డీఎంకేను గద్దె దించడమే లక్ష్యం


