ప్రేమకు ‘అ’భయం
సాక్షి, చైన్నె: శనివారం ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని ప్రేమ జంటలకు అభయం కల్పిస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో హద్దులు మీరకుండా హెచ్చరించేందుకు సిద్ధమయ్యారు. పార్కులు, బీచ్‌లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లలో ప్రేమ జంటలు సందడి చేసే అన్ని ప్రాంతాల్లోనూ భద్రతను కల్పించారు. ప్రేమ జంటల కోసం రోజాపువ్వులు మార్కెట్లో పెద్ద ఎత్తున కొలువుదీరాయి. ప్రేమికులకు ఫిబ్రవరి 14 పండుగ రోజు అన్న విషయం తెలిసిందే. ఈ రోజును ఆదరించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లు మరి కొందరు. వీరితో తమకేంటి అనే వాళ్లూ ఇంకొందరు. ఇక, ప్రేమ జంటలను ఏకం చేస్తూ ప్రేమకోసమే జీవితాన్ని గడిపిన వాలెంటైన్ చనిపోయిన ఈ రోజున తన ప్రేయసి వద్ద, ప్రియుడి వద్ద ప్రేమను వ్యక్తీకరించే వాళ్లెందరో. అలాగే, ప్రేమ వివాహం చేసుకున్న కొత్త జంటల ఆనందానికి అవధులు ఉండవు. ప్రేయసి, ప్రియులతో కలసి వచ్చే ప్రేమికుల కోసం శనివారం పోలీసులు చైన్నె వంటి రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో గట్టి భద్రత కల్పించారు. వ్యతిరేకులు, నిరసన కారుల నుంచి ప్రేమికుల్ని రక్షించే బాధ్యతను తమ భుజాన వేసుకుని పోలీసులు పహారా పెంచారు. చైన్నెలో మెరీనా, గాంధీ బీచ్, పట్టినం బాక్కం బీచ్, బీసెంట్‌నగర్, బీచ్‌లు, గిండీలో చిల్డ్రన్స్ పార్కు, శివారుల్లోని నీలంకరై, కోవలం, మహాబలిపురం బీచ్, వండలూర్ జూసహా పర్యాటక కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ప్రేమజంటలు తరలి రావడం జరుగుతుంది. తమ ప్రేమను వ్యక్తీకరించే వాళ్లు కొందరు అయితే, తమ ప్రేయసి, ప్రియులకు కానుకల్ని సమర్పించుకుని ఆనందాన్ని పంచుకునేందుకు మరెందరో రెడీ అయ్యారు. ఇక, ప్రేమికుల కోసం రోజా పువ్వులు కొలువు దీరాయి. సాధారణంగా చైన్నె మార్కెట్‌కు రోజుకు ఏడు టన్నుల రోజాలు నీలగిరి, హొసూరు, కృష్నగిరి నుంచి వస్తుంటాయి. అయితే, శనివారం అదనంగా మరో ఆరేడు టన్నుల రోజాలు దిగుమతి అయ్యాయి. పది, పన్నెండు రోజా పువ్వులతో కూడిన ప్యాక్‌ను రూ.600 వరకు విక్రయిస్తున్నారు.


