తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌?.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ

Chennai: Covid Cases Rise 111 In Iit Madras - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మళ్లీ కరోనా లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఐఐటీ మద్రాసులో పాజిటివ్‌ కేసులు 111కి చేరుకున్నాయి. ఒకేచోట కేసులు కేంద్రీకృతమై ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ఇక్కడ వైద్య బృందాలు తిష్టవేసి కరోనా పరీక్షలు చేస్తూ విస్తృతం చేశారు.

ఈ పరిస్థితుల్లో చెన్నై గిండీలోని కింగ్స్‌ ప్రభుత్వ కరోనా ఆసుపత్రిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు కరోనా పరిస్థితుల గురించి భయపడాల్సిన పనిలేదు, నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 29 జిల్లాల్లో కరోనా కేసులు లేవు, 9 జిల్లాల్లో చాలా స్పల్పంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందిలో మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఎంతమాత్రం లేవు. కరోనా కట్టుబాట్లపై మైక్రోప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని వివరించారు. కరోనా కట్టడి చర్యలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు, త్వరలో లాక్‌డౌన్‌ వి«ధిస్తారనే వదంతులను ఎంతమాత్రం నమ్మవద్దని ఆయన కోరారు. లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు తమిళనాడులో లేవని తేల్చిచెప్పారు.

ఐఐటీ మద్రాసులో మరో 32 మందికి పాజిటివ్‌
కాగా ఐఐటీ మద్రాసులో సోమవారం వరకు 79 కేసులు నమోదుకాగా మంగళవారం మరో 32 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని డాక్టర్‌ రాధాకృష్ణన్‌ చెప్పారు. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 111కి పెరిగింది. అయితే అదృష్టవశాత్తు కరోనా సోకిన వారంతా క్షేమంగా ఉన్నారు. రాబోయే రెండు రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐఐటీ మద్రాసులోని మొత్తం 7,490 మందిలో ఇప్పటి వరకు 3,080 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

చదవండి: Tamil Actor Vimal: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top