న్యాయ చరిత్రలో బ్లాక్‌ డే: ఒవైసీ

CBI court verdict a black day for judiciary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్‌ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది.

మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top