వీడియో: దళితులకు సరుకులు అమ్మరట!.. కటింగులు చేయరట! ఊరంతా అదే తీరు

Caught on Camera Thanjavur Village practising untouchability - Sakshi

క్రైమ్‌: అంటరానితనం.. శిక్షార్హమైన నేరం. టీవీ ప్రకటనలు, మైకుల్లో వినిపించడం వరకే పరిమితమైందా?. అక్కడక్కడా ఇలాంటి ఘటనపై ఫిర్యాదులు-చర్యలు ఉంటున్నా.. చాలా వరకు ఉదంతాలు వెలుగులోకి మాత్రం రావడం లేదు.  తాజాగా తమిళనాడులో ఓ ఊరు ఊరు మొత్తం తక్కువ కులమంటూ కొందరి పట్ల అస్పృశ్యత కనబర్చడం వీడియో సాక్షిగా బయటపడింది. 

తమిళనాడు తంజావూరు జిల్లా పాపకాడు పరిధిలోని కేళామంగళం గ్రామంలో నవంబర్‌ 28వ తేదీన హిందూ కులాల ఆధ్వర్యంలో పంచాయితీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎస్సీ కులస్తులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ముందు చర్యలుగా వాళ్లకు ఎలాంటి ఉత్పత్తులు అమ్మకూడదని కిరాణ షాపు యాజమానులను ఆదేశించారు. అలాగే హోటల్‌లోకి రానివ్వొద్దని, క్షవరాలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. 

ఇది దృష్టికి రావడంతో ఓ ఎస్సీ యువకుడు.. ఆ మరుసటి రోజే ఓ దుకాణానికి వెళ్లాడు. అయితే తాను సరుకులు అమ్మలేనని, ఇది ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెగేసి చెప్పాడు ఆ ఓనర్‌. ఇదంతా వీడియో తీసిన ఆ యువకుడు.. సోషల్‌ మీడియాలో దాన్ని పోస్ట్‌ చేశాడు. 

విల్లుపురం ఎంపీ రవికుమార్‌ దృష్టికి ఈ విషయం రావడంతో.. ఆయన సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసి చర్యలకు డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలప్పుడు ఎస్సీఎస్టీ కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వీఏవో దర్యాప్తు అనంతరం ఊరిలో షెడ్యూల్డ్ కులాల కమ్యూనిట్‌పై వివక్షత చూపిస్తున్న విషయం వాస్తవమేనని తేల్చారు. ఇక వీడియో ఆధారంగా షాప్‌ ఓనర్‌ వైరముత్తును అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని దుకాణానికి సీల్‌ వేశారు. అంతేకాదు.. 

ఊరిలో టీ దుకాణాల్లో రెండు గ్లాసుల విధానం అమలు అవుతోందని, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ల కోసం ఒక గ్లాస్‌, ఇతర కులాల కోసం మరో గ్లాస్‌ విధానం అమలు అవుతోందని గుర్తించారు. అలాగే బార్బర్‌ దుకాణాల్లోనూ కొన్నిసార్లు వాళ్లకు క్షవరం, కటింగ్‌లు చేసేందుకు కూడా నిర్వాహకులు అంగీకరించడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో.. పోలీసులను మోహరించారు అక్కడ. అఫ్‌కోర్స్‌.. ఇలాంటి ఊర్లు తమిళనాడులోనే కాదు.. అంతటా ఉన్నాయనుకోండి!.

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌లో తమిళనాడు తెన్‌కాశీ పంజాన్‌కుళంకు చెందిన ఓ దుకాణ యజమాని.. దళిత కులానికి చెందిన పిల్లలకు చాక్లెట్లు అమ్మలేదు. తాను గ్రామ పంచాయితీ ఆదేశాలను పాటిస్తున్నానని చూపించేందుకు అతగాడు అదంతా వీడియో తీశాడు. అయితే ఆ వీడియో బయటకు రావడంతో.. శంకరన్‌కోయిల్‌ పోలీసులు మహేశ్వరన్‌ అనే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top