రోడ్డుపై నోట్ల వర్షం?.. స్థానికులు ఏం చేశారంటే..? | Cash Rain On Up Highway: Rs 4 Lakh Found Scattered In Shamli | Sakshi
Sakshi News home page

రోడ్డుపై నోట్ల వర్షం?.. స్థానికులు ఏం చేశారంటే..?

Apr 26 2026 7:47 AM | Updated on Apr 26 2026 10:00 AM

Cash Rain On Up Highway: Rs 4 Lakh Found Scattered In Shamli

షామ్లీ: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో రహదారిపై ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మీరట్-కర్నాల్ హైవే సమీపంలో ఈ ఘటన జరిగింది.

రోడ్డుపై రూ. 500, రూ. 200 నోట్లు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. రోడ్డుపై డబ్బులు పడి ఉండటంతో మొదట కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ.. కొందరు స్థానికులు సంయమనం పాటించారు. వాటిని తీసుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ నోట్లన్నింటినీ సేకరించి పోలీస్ స్టేషన్‌కు తరలించి లెక్కించగా.. మొత్తం 4 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది. కొన్ని నోట్ల కట్టలకు బ్యాంక్ స్లిప్పులు ఉండటంతో ఎవరో బ్యాంకు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని వెళ్తుండగా వాహనం నుంచి కింద పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రికవరీ చేసిన నగదును పోలీస్ 'మల్ఖానా'లో భద్రపరిచారు. ఆ డబ్బు ఎవరిది? అది హైవేపైకి ఎలా వచ్చింది? అనే విషయాలపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్పీ సుమిత్ శుక్లా మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నట్లు ఇప్పటివరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. తాము ఆ నగదు గురించి తెలుసుకోవడానికి బ్యాంకులను కూడా సంప్రదిస్తున్నామని.. ఎవరైనా డబ్బు పోగొట్టుకున్న వారుంటే సరైన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement