వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని డెల్టా వేరియెంట్‌ !

Cases of Delta Variant In India Despite Being Vaccinated - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్‌ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం అయిన  ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని అంచనా వేసింది.  అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తాజా బులెటిన్‌లో తెలిపింది. భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్‌ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది.  మన దేశంలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్‌ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఆ సంస్థ వేస్తున్న అంచనాలు ఆందోళనని పెంచుతున్నాయి.

97.54% కి పెరిగిన కోవిడ్‌ రికవరీ రేటు
దేశంలో కోవిడ్‌–19 కేసులు మరో 36,571 నిర్థారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,58,829కి చేరుకున్నట్లు శుక్రవారం కేంద్రం తెలిపింది. కోవిడ్‌ బారిన పడిన మరో 540 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,33,589కి పెరిగాయని వెల్లడించింది. 540 మరణాల్లో కేరళ నుంచి 197, మహారాష్ట్ర నుంచి 154 నమోదైనట్లు తెలిపింది. అదేవిధంగా, మార్చి 2020 తర్వాత కోవిడ్‌ రికవరీ రేటు 97.54%కి పెరిగిందని పేర్కొంది. యాక్టివ్‌ కేసులు 150 రోజుల తర్వాత 3,63,605కి పడిపోయాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.12%గా ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,26,99,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరపగా, 57.22 కోట్ల డోసుల కోవిడ్‌ టీకా వేసినట్లు పేర్కొంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top