మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా? | Can the Government Seize Your Gold? What Indian Laws Actually Say | Sakshi
Sakshi News home page

మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?

Mar 26 2026 5:38 PM | Updated on Mar 26 2026 6:02 PM

 Can the Government Seize Your Gold? What Indian Laws Actually Say

చట్టాలు ఏం చెబుతున్నాయి?

భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. 

అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్‌గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.

ప్రతి ఏటా మీకు వడ్డీ 
చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్"  వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.

భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే  అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.

ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?
ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.

అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్"  కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.  -వెబ్‌డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement