సోనూసూద్‌కు నిరాశ.. పిటిషన్‌‌ కొట్టేసిన హైకోర్టు

Bombay High Court rejects Sonu Sood pitition - Sakshi

సాక్షి, ముంబై: నటుడు సోనూసూద్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. అన‌ధికారికంగా భ‌వనాలు నిర్మించార‌నే ఆరోపణతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్‌ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి వేసింది. ‘‘నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండి’’ అని జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ పేర్కొన్నారు. మీకున్న అవకాశాన్ని కోల్పోయారు.. మీరు చాలా ఆలస్యమయ్యారు అని తెలిపారు.

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. దీనిపై గ‌తేడాది అక్టోబ‌ర్‌ 20న సోనూసూద్‌కి బీఎంసీ నోటీసులు అందించ‌గా.. వాటిని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. అయితే దాన్ని డిసెంబ‌ర్‌లో దిగువ కోర్టు కొట్టివేయ‌డంతో సోనూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇప్పుడు హైకోర్టు గురువారం విచారించి అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సింగిల్‌ బెంచ్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

నేరాలకు పాల్పడటం సోనూకు ఓ అలవాటుగా మారిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(బీఎంసీ) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్‌ లాభాలు పొందాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్‌ డిపార్టుమెంట్‌ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని వివరించింది. అయితే ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూనే కేవలం ఎం‌సీజెడ్‌ఎం‌ఏ (మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. అది కూడా కోవిడ్‌-19 వల్ల ఆలస్యమతోందని వివరించినా బీఎంసీ వారు వినలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. ఈ విషయమై సోనూపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top