బీజేపీ కొత్త జట్టు రెడీ..! | BJP President Nitin Nabin will unveil his new central team by June end | Sakshi
Sakshi News home page

బీజేపీ కొత్త జట్టు రెడీ..!

Jun 14 2026 12:43 AM | Updated on Jun 14 2026 12:43 AM

BJP President Nitin Nabin will unveil his new central team by June end

రేపటితో అధిక మాసం పూర్తవుతుండటంతో ఏ క్షణమైనా జాతీయ కార్యవర్గం ప్రకటన

పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, జాతీయ కౌన్సిల్‌లో కీలక మార్పులు

పార్టీ విస్తరణలో భాగంగా కీలక పదవుల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం

కొత్త యువ టీమ్‌ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణకు ము హూర్తం దగ్గరపడింది. ఈ నెల 15తో అధిక మాసం ముగియనుండటంతో కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల స్థాయిలో సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుల నియామకాలు దాదాపు పూర్తి కావడంతో కేంద్ర సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరిగిన వరస సంప్రదింపులు, సంఘ్‌ పెద్దలతో చర్చలు కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండటంతో వచ్చే వారం దీనిపై కలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. 

యువత.. దక్షిణాది రాష్ట్రాలు.. ఓబీసీలు..
కొత్త జాతీయ జట్టు కూర్పులో ప్రధానంగా యువత, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం, ఓబీసీలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదికలైన పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ), జాతీయ మండలిలో ఈసారి గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత దశాబ్దంలో పార్టీ విస్తరణకు సేవలందించిన సీనియర్లకు గౌరవప్రద స్థానం కొనసాగిస్తూనే, ఎన్నికల రాజకీయాల్లో చురుకుగా పనిచేసే కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు జరిగినట్లు సమాచారం.

ముఖ్యంగా ఇటీవలి బెంగాల్, బిహార్, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ విజయాలకు బాటలు వేసిన నేతలకు ప్రాధాన్యం ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కర్ణాటకకు చెందిన విజయేంద్ర, ప్రహ్లాద్‌ జోషి, తమిళనాడు నుంచి ఎల్‌. మురుగన్, కేరళ నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్, ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలకు జాతీయ టీమ్‌లో ప్రాధాన్యం పెరిగే అవకాశాలపై ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఇప్పటికే రాష్ట్ర విభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించి, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యం, ఎన్నికల సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

కొత్త కార్యవర్గంలో 40–50 ఏళ్ల నాయకులకు ప్రాధాన్యం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకుగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా నాయకులకు కూడా కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కేంద్ర మంత్రులు, సంస్థాగత నేతలకు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement