వైరల్‌ చాయ్‌వాలీ ప్రియాంక.. దుకాణం బంద్‌! కారణం ఉందండోయ్‌..

Bihar Graduate Chaiwali Priyanka Shift Her Business To Truck - Sakshi

పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్‌ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్‌లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్‌ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్‌ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్‌ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది.

బీహార్‌ పాట్నాలో ఉమెన్స్‌ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్‌ నడిపిస్తోంది ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్‌) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట.  ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా?  అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్‌ ఓపెన్‌ చేసింది. ‌ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. 

అయితే ఈ గ్రాడ్యుయేట్‌ చాయ్‌వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్‌ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్‌ ట్రక్‌ను కొందరు స్టాఫ్‌తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్‌ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top