నగ్న వీడియో వైరల్‌.. హనీట్రాప్‌ వెనుక ఇదీ కుట్ర!

Basavalinga Seer Suicide Case: Semi Nude video Goes Viral - Sakshi

బండెమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసు..  

కణ్ణూరు మృత్యుంజయ స్వామి సూత్రధారి  

 ఇప్పటికి ముగ్గురు అరెస్టు 

వారం రోజుల కిందట బండెమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో తొలిరోజే వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యాయి. మరో మఠం స్వామి కుట్ర పన్ని ఆయనను హనీ ట్రాప్‌లో ఇరికించడం, ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడం బండెమఠం స్వామి ఆత్మహత్యకు కారణమని తేలింది. ఓ యువతిని మఠానికి పంపి స్వామీజీని లోబర్చుకుని వీడియోలు తీశారు. పరువు పోవడం కంటే ప్రాణం పోతే మేలనుకునేలా ఆయనను ఒత్తిడికి గురిచేశారు. సూత్రధారి ఆయనకు బంధువు కావడం గమనార్హం. మఠాల మధ్య సాగుతున్న చీకటి పోరాటాల్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది.

సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడి తాలూకా కంచుగల్‌ బండేమఠ బసవలింగస్వామి (45) ఆత్మహత్య కేసులో అదే జిల్లా కణ్ణూరు మఠం మృత్యుంజయ శ్రీ, స్థానిక నేత మహదేవయ్య, ఇంజనీరింగ్‌ విద్యార్థిని నీలాంబికను ఆదివారం రామనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. బసవలింగ స్వామి రాసిన డెత్‌నోట్‌లో మూడు పేజీలలో పూర్తి సమాచారం తెలియపరిచారు. 21 ఏళ్ల నీలాంబికను బండేమఠానికి పంపి కణ్ణూరు మృత్యుంజయ స్వామి హనీట్రాప్‌కు పాల్పడ్డారని డెత్‌నోట్‌లో ప్రస్తావించారు. కణ్ణూరు స్వామి, ఇతర ఏడెనిమిదిమందితో వేధింపులను ఎదుర్కొన్నానని, మఠం గురించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన చావుకు ఆ యువతి కారణమని రాసిపెట్టారు.  

రాష్ట్రంలో సంచలనం  
బండేమఠ బసవలింగస్వామీజీ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, మూడు ప్రత్యేక పోలీస్‌ బృందాలతో నిందితుల కోసం వేట మొదలైంది. మృతుడు వివరంగా డెత్‌నోట్‌ రాయడంతో పోలీసుల పని సులువైంది. హనీ ట్రాప్‌ జరిగినట్లు తొలిరోజే వెలుగుచూసింది. నిందితుల అరెస్టులతో ఇది ఖరారైంది. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని రామనగర ఎస్‌పీ సంతోష్‌బాబు తెలిపారు.  

నగ్న వీడియో వైరల్‌  
బండేమఠం స్వామి ప్రైవేటు వీడియోలు వైరల్‌ అయ్యాయి. అందులో మొదటి రెండు వీడియోల్లో అర్దనగ్నంగా ఉన్న ఆయన ఆ తరువాత పూర్తి నగ్నంగా ఉన్నారు. కానీ వీడియో కాల్‌ చేసిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఆమె వీడియో కాల్‌ను రికార్డ్‌ చేసుకుని ఆడియోను మ్యూట్‌ చేసింది.  

8 మంది తీవ్ర విచారణ  
ఈ కేసులో 8 మందిని పోలీసులు విచారణ చేపట్టారు. స్వామీజీ యువతి గురించి పదేపదే లేఖలో పేర్కొన్నారు. మూడో వీడియో కూడా శనివారం లీక్‌ అయింది. మరో మొబైల్‌లో దృశ్యాలను చూపుతూ ముద్దు పెట్టుకుందామా అని మహిళను కోరే దృశ్యాలు ఉన్నాయి. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశముంది.

పావుగా బెంగళూరు విద్యార్థిని   
ఈ కేసులో రామనగర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా బెంగళూరుకు చెందిన నీలాంబికను అదుపులోకి తీసుకున్నారు.  కణ్ణూరు మృత్యుంజయస్వామీమి, బండెమఠం బసవలింగస్వామీజీ బంధువులని తెలిసింది. బండెమఠం పీఠం కోసం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మృత్యుంజయ స్వామిని రామనగర పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. ఇతనితో 8 మంది చేతులు కలిపినట్లు తెలిసింది. అపారమైన సంపద ఉన్న బండె మఠాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి యువతి ద్వారా పథకం నడిపించారు. బండెమఠ పాఠశాలలలో పనిచేసే పంకజ అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top