జైహింద్‌ స్పెషల్‌: పెన్నులతో గన్నుల పైకి | Azadi Ka Amrit Mahotsav: Important Newspapers During Indian Freedom Struggle | Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: పెన్నులతో గన్నుల పైకి

Jun 16 2022 12:53 PM | Updated on Jun 16 2022 12:53 PM

Azadi Ka Amrit Mahotsav: Important Newspapers During Indian Freedom Struggle - Sakshi

1999లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టల్‌ స్టాంప్‌పై హిందూస్థాన్‌ టైమ్స్‌ దిన పత్రిక. 

ప్రభుత్వం మీద ప్రజలను రెచ్చగొట్టే రచనలు ప్రచురిస్తే  నేర శిక్షాస్మృతి 124ఏ నిబంధన కింద కఠిన శిక్షలు విధించే అవకాశం ఉన్నా చాలా పత్రికలు అందుకు సిద్ధమై పనిచేశాయి.

1870 ప్రాంతం నుంచి భారత పత్రికా రంగం వేళ్లూనుకోవడం మొదలయింది. పత్రికలు కేవలం రాజకీయ చైతన్యం రేకెత్తించడం వరకే పరిమితం కాలేదు. జాతీయ భావాలు నింపడంతోనే బాధ్యత పూర్తయిందని అనుకోలేదు. తొలి దశలో భారతీయ సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలు, దురాచారాల నిర్మూలనకు కూడా కృషి చేశాయి. స్వతంత్ర దేశం దిశగా, స్వయం పాలన ఆశయంగా సాగుతున్న ఉద్యమంలో విద్య, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థ, కుటీర పరిశ్రమలు, సేద్యం వంటి వ్యవస్థల పునర్‌ నిర్మాణానికి ఆనాటి పత్రికారంగం బాటలు వేసింది.
చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్‌ మూత!!

ప్రభుత్వం మీద ప్రజలను రెచ్చగొట్టే రచనలు ప్రచురిస్తే  నేర శిక్షాస్మృతి 124ఏ నిబంధన కింద కఠిన శిక్షలు విధించే అవకాశం ఉన్నా చాలా పత్రికలు అందుకు సిద్ధమై పనిచేశాయి. ఇది చాలదన్నట్టు భారతీయ భాషా పత్రికల చట్టం 1878 ని ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఒక్క సమావేశంతోనే హడావుడిగా తెచ్చింది. దీని ప్రకారం పత్రికను అచ్చువేసే ప్రెస్‌ ఆస్తులను జప్తు చేయవచ్చు. 1881లో దీనిని రిపన్‌ రద్దు చేశాడు. పత్రికా రచయితగా ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారతదేశంలో తొలిసారి జైలుకు వెళ్లిన ఘనత సురేంద్రనాథ్‌ బెనర్జీకి (ఐపీఐ అవార్డు 2007, ప్రదానోత్సవంలో ఔట్‌లుక్‌ పత్రిక సంపాదకుడు వినోద్‌ మెహతా ఇచ్చిన ఉపన్యాసం) దక్కుతుంది.
 
బ్రిటిష్‌వాద పత్రికలు!
1900–1947 వరకు కనిపించే దశ ఒకటి. ఈ దశలోనే అతి జాతీయవాద, మితవాద ధోరణులతో సాగిన ఉద్యమం గురించి వార్తాపత్రికలు విశ్లేషించవలసి వచ్చింది. తీవ్ర జాతీయవాదం రంగం మీదకు వచ్చింది. జాతీయవాద పత్రికారంగానికీ, బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వానికీ మధ్య యుద్ధం కూడా తీవ్రమైంది. బ్రిటిష్‌ ఇండియాను సమర్థించే పత్రికలు జాతీయవాద పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం మరొక వాస్తవం. పత్రికల పాత్ర మరింత సునిశితమైంది. హిందుస్తాన్‌ టైమ్స్, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయవాదం వైపు మళ్లాయి.

భారత్‌ మిత్ర.. కలకత్తా సమాచార్‌ 
1850–1857 మధ్య హిందీలో చాలా పత్రికలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ‘భారత్‌ మిత్ర’, ‘కలకత్తా సమాచార్‌’ వంటివి అప్పుడే వెలువడినాయి. 1920లో బెనారస్‌ నుంచి వెలువడిన ‘ఆజ్‌’ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఆ సంవత్సరమే బాబూ రాజేంద్రప్రసాద్‌ పట్నా నుంచి ఆరంభించిన ‘దేశ్‌’ కాంగ్రెస్‌ వాణిగా పనిచేసింది. ఉర్దూలో ‘మిలాప్‌’, ‘ప్రతాప్‌’, ‘తేజ్‌’ తమ వంతు పాత్రను నిర్వహించాయి.1923లో కేరళలో ఆరంభమైన ‘మాతృభూమి’ కూడా కాంగ్రెస్‌ అధికార పత్రిక వంటిదే.

అంతకు ముందే ఆరంభమైన కేరళ పత్రిక బ్రిటిష్‌ పాలన మీద విమర్శలు కురిపించేది. తమిళంలో 1917లో ప్రారంభమైన ‘దేశభక్తన్‌’ పత్రికకు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వరాజ్య సమరంలో సిద్ధాంతవేత్తగా పేర్గాంచిన వీవీఎస్‌ అయ్యర్‌ దీని సంపాదకుడు. మైసూరు సంస్థానంలో ‘విశ్వ కర్ణాటక’ పత్రిక 1921 నుంచి జాతీయ భావాల వ్యాప్తి కోసం పనిచేసింది. తిలక్‌ ప్రభావం ఉన్న కొందరు వ్యక్తులు అక్కడ స్థాపించిన పత్రిక ‘జయ కర్ణాటక’. స్వాతంత్య్రోద్యమంలో ఉన్న నాయకులు, కార్యకర్తలనే కాదు, పత్రికా రచయితలను కూడా బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం అంతే ద్వేషంతో చూసింది. కఠిన కారాగార శిక్షలు, అండమాన్‌ ప్రవాసాలు, మాండలే నిర్బంధాలు, జరిమానాలు, జప్తులు పత్రికా రచయితలకు కూడా తప్పలేదు. 

బాలగంగాధర తిలక్‌
భారత స్వాతంత్య్ర సమరంలో, ఆనాటి పత్రికా రంగంలో రెండు దశాబ్దాల పాటు ముఖ్య భూమికను పోషించిన యోధుడు బాలగంగాధర తిలక్‌. స్వాతంత్య్రం నా జన్మహక్కు అని గొప్ప నినాదం ఇచ్చి, పత్రికలకూ, పోరాటానికీ నడుమ ఉన్న తాత్త్విక బంధం నిరూపించారాయన. ప్రభుత్వ వ్యతిరేకతతో తిలక్‌ను మూడు పర్యాయాలు దేశద్రోహం నేరం కింద ప్రభుత్వం విచారించింది. 1897లో ఆయనకు 18 మాసాల శిక్ష పడింది. ర్యాండ్‌ అనే బ్రిటిష్‌ అధికారిని చాపేకర్‌ సోదరులు చంపడాన్ని తిలక్‌ సమర్థించారు. ర్యాండ్‌ అప్పుడు ప్లేగ్‌ బారిన పడిన వారి పట్ల పరమ కర్కోటకంగా వ్యవహరించాడని పేరు. 1908లో ముజఫర్‌నగర్‌ దగ్గర మేజిస్ట్రేట్‌ డగ్లస్‌ కింగ్స్‌ఫోర్డ్‌ లక్ష్యంగా వాహనం మీద బెంగాలీ యువకులు ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్‌ బాంబు విసరడాన్ని కూడా తిలక్‌ సమర్థించారు. అంతేకాదు, భారతీయులకు స్వరాజ్యం ఇవ్వాలని తన పత్రికలో రాశారు. వెంటనే ప్రభుత్వం విచారించి ఆరున్నరేళ్ల కారాగారం విధించి, మాండలే జైలుకు పంపింది. 1916లో మరొకసారి దేశద్రోహం కేసుతో తిలక్‌కు శిక్ష విధించింది.

గాంధీజీతో మదన్‌ మోహన్‌ మలావియా
ప్రసిద్ధ జాతీయవాద పత్రిక ‘హిందూస్థాన్‌ టైమ్‌’.. 1924లో ప్రారంభమైన కొన్ని నెలలకే  బ్రిటిష్‌ పాలకుల ఒత్తిళ్లకు మనుగడ సాగించలేని స్థితిలో, మూసివేత తప్ప మరో మార్గం లేదనుకున్నప్పుడు మాలావియానే ముందుకొచ్చి 50 వేల రూపాయల విరాళాలు సేకరించి ఆ పత్రికను నిలబెట్టారు.

 

అయ్యర్‌ మీద కేసు
తన పత్రికలను దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తున్నారని ‘ది హిందూ’ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్‌ మీద కేసు పెట్టారు. 1908లో ఆయన కారాగారవాసం అనుభవించారు. అమృత్‌బజార్‌ పత్రిక వ్యవస్థాపకులు శిశిర్‌కుమార్‌ ఘోష్, మోతీలాల్‌ ఘోష్‌లను 1897లో దేశద్రోహం కేసు కింద జైలుకు పంపారు. ఆ ఇద్దరు సోదరులు. బాంబే క్రానికల్‌ ఎడిటర్‌ బీజీ హార్నిమన్‌ను కూడా బ్రిటిష్‌ వ్యతిరేకత కారణంగా నిర్బంధించి, బలవంతంగా ఇంగ్లండ్‌ పంపారు. 
– డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement