లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అయోధ్య రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చంపత్‌రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఎనిమిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద కేసులు నమోదు చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం.. రామమందిరానికి భక్తులు సమర్పించిన రూ.200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో మరింత సంచలనంగా మారిన అంశం.. సీసీటీవీ ఫుటేజీ మాయమవడం. అలాగే ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు విశ్వాసంతో సమర్పించిన డబ్బు, కానుకలను అంతర్గతంగా ఉన్నవారే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
ప్రస్తుతం అరెస్టయిన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్లింది? ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ట్రస్ట్‌లోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య రామమందిరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా సమర్పించిన విరాళాలే అక్రమాలకు గురయ్యాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రస్ట్‌లో ఇద్దరు కీలక సభ్యుల రాజీనామా, పలువురు అరెస్టులు, భారీ విరాళాల మాయంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.
యోగి ఏమన్నారంటే..
అయోధ్య విరాళాల చోరీ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. "అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. అయోధ్యపై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. శ్రీరాముడిని గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది.. చర్యలు కూడా ప్రారంభమయ్యాయి" అని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన.. "ఈరోజు ఆరోపణలు చేస్తున్నవారే ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించారు. అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచే వ్యతిరేకించారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన వారిపై లాఠీచార్జీలు, కాల్పులు జరిపారు. రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు, కావడ్ యాత్రను నిషేధించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడమే కాకుండా ముక్కలు చేసింది. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్‌కు అందించాలి. రామభక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడొద్దు" అని యోగి అన్నారు.


