
పట్నా: ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్‌తో పాటు, వివిధ పార్టీలు సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. తాజాగా జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సనాతనుల సత్తాను చాటేందుకు రాబోయే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
బీహార్‌లోని బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో సనాతన లక్ష్యాలకు కట్టుబడిన అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు వారంతా చురుకుగా పాల్గొంటారని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో సామాజిక సమస్యల పరిష్కార లక్ష్యం కలిగి, గో రక్షణతో పాటు సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్న తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని శంకరాచార్య ఓటర్లను కోరారు.
పట్నాలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన స్వామి అవిముక్తేశ్వరానంద.. గో రక్షణ కేవలం మత విశ్వాసానికి సంబంధించినది మాత్రమే కాదని, సమాజం, సంస్కృతికి పునాది అని స్పష్టం చేశారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే డిమాండ్‌తో తాను ఢిల్లీలోని జాతీయ పార్టీలను సంప్రదించానని, కానీ దీనిపై స్పష్టమైన స్పందన రాలేదని అన్నారు. బీహార్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తర్వాత అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. అయితే ఏదైనా పార్టీ అభ్యర్థి గో సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆ నియోజకవర్గాల్లో, తాము తమ అభ్యర్థిని నిలబెట్టబోమని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని బ్రహ్మన్‌పూర్ గ్రామంలో 1969, ఆగస్టు 15న జన్మించిన ఉమాశంకర్ ఉపాధ్యాయ, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రి, ఆచార్య డిగ్రీలను పూర్తి చేశారు. 2003, ఏప్రిల్ 15న దండ్ సన్యాసం తీసుకున్నాక ఆయన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిగా మారారు. 2022,సెప్టెంబర్‌లో ఆయన జ్యోతిష్య పీఠానికి శంకరాచార్యగా నియమితులయ్యారు.
ఆయన గో రక్షణ, సనాతన సంప్రదాయాల పునరుద్ధరణ తదితర అంశాలపై చాలాకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో అవిముక్తేశ్వరానంద సరస్వతి ‘గంగ’ను జాతీయ నదిగా ప్రకటించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.