
గువాహటి: అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన వేలంలో ప్రత్యేక రకమైన ‘మనోహరి గోల్డ్’ టీ పొడికి కిలో రూ.99,999 ధర పలికింది. దేశంలో టీ పొడికి ఇదే అత్యధిక ధర.
టీ రుచిలో ప్రత్యేకత కోరుకునే అభిరుచిగల వినియోగదారుల కోసం ఇలాంటి ప్రీమియం టీ పొడిని తయారు చేస్తామని మనోహరి టీ ఎస్టేట్ యజ మాని రాజన్ లోహియా అన్నారు. ఈ టీ పొడిని కాచినపుడు డికాక్షన్ ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుందని, సేవిస్తే మనసు తేలికపడిన భావన కలుగుతుందని, పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ టీపొడిని సౌరభ్ టీ ట్రేడర్స్ రికార్డు ధరకు కొనుగోలు చేసిందని వేలం నిర్వాహకులు తెలిపారు.