భారత ఆర్మీ ‘చీతా’ క్రాష్‌: తెలంగాణవాసి లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం

Army Helicopter Cheetah Crash: Telangana Lt Col VVB Reddy Dies - Sakshi

సాక్షి, యాదాద్రి: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

కల్నల్ వీవీబీ రెడ్డి‌ స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్‌.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్‌ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెస్ట్‌ కామెంగ్‌ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్‌ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్‌ మేజర్‌ జయంత్‌ ఆచూకీ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top