Amarnath Yatra: కాపాడాలని రాయగడ యువకుల వీడియో సందేశం

Amarnath Yatra: Odisha Tourists Stranded Middle - Sakshi

నవరంగ్‌పూర్‌ వాసులు క్షేమం

కొరాపుట్‌(భువనేశ్వర్‌): పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఒడిశా వాసులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. ఇందులో నవరంగ్‌పూర్‌ వాసులు క్షేమంగా భయటపడగా, రాయగడకు చెందిన యువకులు మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందించారు. నవరంగపూర్‌జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన పశుమర్తి నగేష్, శాంతి, వినయ్, వాసు, చిన్ను, సోహిణీ, హరి, బొద్దుపు సునీత యాత్రకు భయలుదేరి వెళ్లారు. వీరితో పాటు జయపురానికి చెందిన కోట కామేశ్వరరావు, చంద్ర దంపతులు, సాలూరులో పలివెల శ్రీను, జ్యోతి, పార్వతీపురానికి చెందిన నాగుల రేష్మ దంపతులు తోడయ్యారు.

అంతా శుక్రవారం అమర్‌నాథ్‌లో విపత్తు జరిగే సమయానికి కొన్ని గంటల ముందు స్వామివారి దర్శనం చేసుకొని, తిరిగి శ్రీనగర్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీరు అమర్‌నాథ్‌ గుహ వద్దనే ఉన్నారు. సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీనగర్‌ చేరే సమయంలో విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి టీవీల్లో దుర్ఘటన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. జమ్మూ–కశ్మీర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోస్ట్‌పెయిడ్‌ ఫోన్లు మాత్రమే పని చేస్తాయి. కేవలం స్థానికులకు మాత్రమే ప్రీ పెయిడ్‌ ఫోన్లు పనిచేస్తాయి. వెళ్లిన వారందరివీ ప్రీపెయిడ్‌ ఫోన్లు కావడంతో వీరి క్షేమ సమాచారం ఆలస్యమైంది. శ్రీనగర్‌లో ప్రతి హోటల్‌లో వైఫై సదుపాయం ఉంటుంది. దీంతో వీరందరి ఫొటోలు వాట్సాప్‌లో పంపిచడంతో అంతా క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గండం నుంచి భయట పడ్డామని యాత్రికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 

చిక్కుకున్న రాయగడ వాసులు.. 
రాయగడ: ‘అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాం. అనుకోని విధంగా అంతా ప్రమాదంలో చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడండి’ అని రాయగడకు చెందిన యువకులు వీడియో సందేశం ద్వారా ప్రాథేయపడ్డారు. పట్టణంలోని కాళీపూజ జంక్షన్‌కు చెందిన బసంతకుమార్‌ సేనాపతి, సౌమ్యరంజన్‌ పాత్రొ, కొనతాం రవికుమార్, టుకున ప్రధాన్, నిహార్‌రంజన్‌ పాత్రొ 10రోజుల క్రితం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాం. వీరంతా తమకు సంబంధించిన సామగ్రిని జమ్మూలో విడిచి, అమర్‌నాథ్‌కు పయనమయ్యారు. యాత్రలో భాగంగా మంచులింగాన్ని శుక్రవారం ఉదయం దర్శించుకుని, తిరిగి వస్తున్న సమయంలో వంశతరణి నదీ వర్షబీభత్సానికి వారు నివసించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్‌లు కొట్టుకుపోయాయి.

దీంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బాతల్‌ నుంచి నడక ప్రయాణం కొనసాగించామని వీడియో ద్వారా రాయగడలో ఉన్న తమ మిత్రులకు తెలియజేశారు. ప్రస్తుతం తాము ఐదుగురం మంచుకొండలపై ప్రయాణం చేస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మూ వరకు తమను చేర్చేవిధంగా సహకరించాలని వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం స్పందించి తమ వారిని కాపాడాలని బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు.

చదవండి: కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‍బై! బీజేపీ గూటికి కుల్‌దీప్ బిష్ణోయ్!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top