
అహ్మదాబాద్ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..
జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్ ఎయిర్‌పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది.
బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు..
కేరళ కాలికట్(కోజికోడ్) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్ ఎయిర్‌పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.