చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్‌డీఏ కూటమి సారథిగా ఉన్న ఏఐఏడీఎంకే తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసి, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు.
సొంత గడ్డపైనే పోటీ
పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ‘ఎడ్పాడి’ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తన కంచుకోటను కాపాడుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.
సీనియర్లకే పెద్దపీట
తొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు.
రేసులో ముందంజ
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్‌టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే, ఈ తొలి జాబితా ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది.
அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்றக் கழக முதற்கட்ட வேட்பாளர்கள் பட்டியல்.
- மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் புரட்சித் தமிழர் @EPSTamilNadu அவர்கள் அறிவிப்பு. #EPSfor2026#Vote4AIADMK pic.twitter.com/HVvrcUtDpt— AIADMK - SayYesToWomenSafety&AIADMK (@AIADMKOfficial) March 25, 2026


