అదానీ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

Adani Issue:Centre Agrees To Supreme Courts Suggestion For Expert Committee - Sakshi

న్యూఢిల్లీ:  అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారం, ఈ అంశంలో వచ్చిన ఆరోపణల నిజనిజాలు తేల్చడానికి (The Securities and Exchange Board of India (SEBI)) సెబీకి అన్ని రకాల అర్హతలున్నాయని, అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా. హిండెన్ బర్గ్ రిపోర్టు, తదనంతర పరిణామాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వం వహించిన బెంచ్ ముందు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. కమిటీలో ఎవరెవరు ఉండాలో నిర్ణయిస్తే..  శుక్రవారం రోజు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కమిటీలో ఎవరెవరి పేర్లు ఉండాలో ఒక సీల్డ్ కవర్లో బుధవారం సుప్రీంకోర్టుకు అందజేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. 

సుప్రీంకోర్టులో ఇప్పటికే 22 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన సెబీ... హిండెన్ బర్గ్ నివేదికలో అంశాలతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఆ నివేదిక చూపించిన ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. హిండెన్ బర్గ్ తమ నివేదికను బయటపెట్టక ముందు, అలాగే నివేదికను వెల్లడించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను, దాని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఏవైనా అవకతవకలు జరిగాయా అన్న అంశాలను పరిశీలిస్తున్నామని సెబీ తెలిపింది. 

సెబీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన సుప్రీంకోర్టు.. కమిటీ ఏర్పాటు వల్ల మరింత లోతుగా, క్షుణ్ణంగా ఈ వ్యవహారాన్ని విచారణ చేయవచ్చని తెలిపింది. పెట్టుబడిదారులు నష్టపోకుండా కేంద్రం ఏం చేయవచ్చన్నదానికి ఇది స్పష్టత నిచ్చే అవకాశం ఉందని, ఏవైనా చట్ట సవరణలు చేయాలా అన్న అంశం కూడా తెలుస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

స్టాక్ మానిప్యులేషన్‌‌‌‌, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్‌‌‌‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపి, కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే కమిటీ సభ్యులను సూచించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top