ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌? 

150 Districts With Over 15Percent Positivity Rate May Go Under Lockdown - Sakshi

ఈ జిల్లాల్లో 15% పైగా పాజిటివిటీ రేటు 

ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం 

లాక్‌డౌన్‌ సిఫారసు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ 

రాష్ట్రాలతో సంప్రదించాక కేంద్రం నిర్ణయం!

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో కోవిడ్‌–19 పాజిటివిటీ రేటు 15 శాతం పైగా ఉంది. దీంతో ఆ జిల్లాల్లో వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదు. ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదంలో ఉంది. దీంతో ఈ 150 జిలాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లాక్‌డౌన్‌ను సిఫారసు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాక్టివ్‌ కేసులను, పాజిటివిటీ రేటును యుద్ధప్రాతిపదికన నియంత్రించడం అవసరమని, లేకపోతే ఆరోగ్య వ్యవస్థపై భారం పెరుగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే లాక్‌డౌన్‌కు సంబంధించి రాష్ట్రాలను సంప్రదించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.  

ఏప్రిల్‌ 5న తొలిసారిగా భారత్‌లో రోజుకి లక్ష కేసులు దాటాయి.  ఆ తర్వాత 10 రోజులకే ఏప్రిల్‌ 15న 2 లక్షలు కేసులు దాటడం చూశాం. ఇక ఏప్రిల్‌ 22న మొట్ట మొదటిసారి 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచి  కేసుల సంఖ్య అలా అలా పెరిగిపోతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. మంగళవారం నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 10 రాష్ట్రాల్లోనే 73.59 శాతం వచ్చాయి. పుణే, ముంబై, థానే, బెంగుళూరు అర్బన్, ఢిల్లీ, రాయ్‌పూర్, నాసిక్, దుర్గ్, ఔరంగాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చదవండి: (కరోనా ఇండియన్‌ స్ట్రెయిన్‌ చాలా ఫాస్ట్‌!)

ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ ఆంక్షలు కఠినంగానే అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. మే 1 వరకు అమల్లో ఉండే లాక్‌డౌన్‌ మే 15 వరకు కొనసాగుతుంది. మరోవైపు కొద్దిరోజుల కిందట దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ లాక్‌డౌన్‌ అనేది ఆఖరి అస్త్రం కావాలని, అంతదాకా పరిస్థితులు రానివొవ్వద్దని పేర్కొన్నారు. ప్రజలందరూ కోవిడ్‌ ప్రొటోకాల్‌కు కచ్చితంగా పాటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మైక్రో కంటైన్‌మెంట్‌కే ప్రాధాన్యమిస్తోందనేది ప్రధాని మాటలను బట్టి స్పష్టమైంది. మరి ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

గోవాలో 4 రోజులు.. 
గోవాలో ఒకే రోజు కరోనా కేసులు 2 వేలు దాటిపోవడంతో ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 29 నుంచి మే 3 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. అత్యవసర సర్వీసులు, పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రజా రవాణాకు మాత్రం అనుమతి లేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top