ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు

11 Months After Bull Attack Rajasthan Man Gets New Face On Series Of Surgeries - Sakshi

రాజస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటన

ఎంతో శ్రమకోర్చి అద్భుతం చేసిన వైద్యులు

జైపూర్‌: ముఖంపై చిన్న మొటిమ, మచ్చ ఏర్పడితే చాలా బాధ పడతాం. దాన్ని తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మనిషి అందానికి మొహమే ప్రతీక. కనుక ముఖ సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. అలాంటిది అనుకోని ప్రమాదంలో ముఖం పూర్తిగా చిధ్రమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ వ్యక్తికి. ఊహించని ప్రమాదంంలో అతడి ముఖం నుజ్జు నుజ్జయ్యింది. పూర్తిగా రూపు కోల్పోయిన ముఖానికి పూర్వపు ఆకారం తీసుకురావడం కోసం డాక్టర్లు ఎంతో శ్రమించి.. అనేక సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

                                               దాడి జరగడానికి ముందు బిష్ణోష్‌ (ఫైల్‌ ఫోటో)

రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన కర్ణీ బిష్ణోయ్ స్థానిక ఎఫ్‌ఎంసీజీ కంపెనీలో ఆపరేటింగ్‌ హెడ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో బిష్ణోయ్‌ తన సోదరి, స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా వారి వాహనానికి ముందు కొన్ని ఎద్దులు వచ్చాయి. దాంతో బిష్ణోయ్‌ కారు వేగాన్ని తగ్గించి.. నెమ్మదిగా వెళుతున్నాడు. ఈ క్రమంలో కారు అద్దం సగం దించి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా బిష్ణోయ్‌ ముఖాన్ని కొమ్ములతో కుమ్మింది. అతడిని కారు నుంచి బయటకు లాగి పడేసింది.

ఆ దాడిలో బిష్ణోయ్‌ కుడి కన్ను, ముక్కుతో పాటు ముఖం కుడి భాగమంతా నుజ్జునుజ్జయింది. ఈ దాడిలో బిష్ణోయ్ స్నేహితునికి స్వల్ప గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న బిష్ణోయ్‌ను అతని సోదరి బికనీర్‌లోని ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక చిక్సిత్సనందించిన వైద్యులు.. అతడికి చికిత్స ఇవ్వడం తమ వల్ల కాదని.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. 

దాంతో బిష్ణోయ్‌ని సాకేత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక అతడి పరిస్థితి చూసి షాకయినట్లు సీనియర్‌ న్యూరో సర్జన్‌ తెలిపారు. అప్పటికే అతడి వెంటిలేషన్‌ ట్యూబ్‌ బ్లాక్‌ అయిటన్లు వైద్యులు గుర్తించారు. వెంటనే న్యూరో సర్జన్లు, ప్లాస్టిక్‌ సర్జన్లు పిలిపించారు. కరోనా నిబంధనలను అనుసరించి పీపీఈ కిట్‌లు ధరించిన వైద్యులు సుమారు పదిగంటల పాటు శ్రమపడి అతని ముఖానికి సర్జరీ చేశారు. అప్పటికీ ముక్కలు ముక్కలైన అతని ముఖం ఎముకలు, ముక్కులను అతికించారు. తొమ్మిది గంటలపాటు నిర్వహించిన మరో సర్జరీతో అతని ప్రాణాలు కాపాడటమే కాకుండా ముఖం తిరిగి ఒక రూపు సంతరించుకుంది అని తెలిపారు వైద్యులు.

ఆ తర్వాత మరో నాలుగు నెలల అనంతరం మరో సర్జరీ నిర్వహించారు. అప్పటికే అతని ముఖం కుడి భాగమంతా పక్షవాతానికి గురైంది. భారత్‌లో మొదటిసారిగా నుదిటి కండరాలకు తేలికపాటి చికిత్సను అందించినట్లు వైద్యలు తెలిపారు. జులై నాటికి బిష్ణోయ్ తన కుడి కనుబొమ్మను, నుదిటిని కదపగలిగాడు. నెమ్మదిగా అతని ముఖం కూడా పూర్తిగా మానవరూపాన్ని సంతరించుకుందని వైద్యులు  తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ కన్నుతో ఉన్న అతనికి మరికొన్ని సర్జరీలు చేయాల్సి వుందని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top