నారాయణపేట రూరల్/ధన్వాడ: సంపూర్ణ విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్ ప్రారంభించారు. అలాగే ధన్వాడలో ఎస్సీ విద్యార్థుల వసతిగృహాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న సింగిల్‌విండో గోదాం విద్యార్థులకు అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్ నారాయణపేటకు తరలించడం నిలిపివేయాలని.. ఇక్కడే అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని అధికారుల కు సూచించారు. అనంతరం కిష్టాపూర్‌లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోటకొండ పాఠశాల జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న పీఎం శ్రీ పాఠశాలగా.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను పొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కోటకొండలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రాములుగౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, యాదయ్యశెట్టి, సంగీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పార్టీ మాజీ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, ధన్వాడ, కిష్టాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి కొండయ్య, తహసీల్దార్ సింధూజ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాకం సురేందర్, రతంగ్‌పాండురెడ్డి, రామచంద్రయ్య, శివరాజు పాల్గొన్నారు.


