నేడు జిల్లాకేంద్రంలో 2కే రన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకేంద్రంలో 2కే రన్‌

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

నారాయణపేట: ప్రత్యేక సవరణ కార్యక్రమం–2026లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు జిల్లాకేంద్రంలో 2కే రన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నాణ్యమైన భోజనం

అందించాలి

నారాయణపేట రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. బుధవారం మండలంలోని జాజాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం చేయాలని, కూరగాయలను శుభ్రంగా కడిగి వండాలన్నారు. వారానికి మూడు గుడ్లు తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంతకుముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, ఏపీఎం నారాయణ, ప్రధానోపాధ్యాయులు భారతి, భానుప్రకాష్‌, నిర్మల, నర్సింహులు, శిరీష తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల అభివృద్ధే తన లక్ష్యమని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో జరిగిన జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో అధ్యక్షుడిగా మక్తల్‌ మండలంలోని మంతన్‌గోడు సర్పంచ్‌ రాజేందర్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతామన్నారు. అనేక గ్రామపంచాయతీల వారీగా సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్‌ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement