నారాయణపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు ఎలాంటి లోటు లేకుండా అందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మండలంలోని అప్పక్‌పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముుుందుగా యూడీఐడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నమోదు ప్రక్రియ, రోజువారీ సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఆడియాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ విభాగాలతో పాటు సౌండ్ ప్రూఫ్ గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులతో సమావేశమై మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలు, మందుల లభ్యత, ఆర్థిక అవసరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉన్న విభాగాలను గుర్తించి వీలైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘సంకల్ప్’పై ప్రత్యేక దృష్టి..
శిశు మరణాల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆస్పత్రి డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సంపత్‌కుమార్‌సింగ్, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌కు కలెక్టర్ సూచించారు. మాత, శిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు, చికిత్స సకాలంలో అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసి సంతప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డా. మల్లికార్జున్, ఆర్‌ఎంఓ డా. బాలాజీ, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


