సమర్థవంతంగా ‘భరోసా’ సేవలు | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘భరోసా’ సేవలు

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

నారాయణపేట: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, లైంగిక దాడులు తదితర నేరాల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డా. వినీత్‌ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాధితులు ఒకేచోట వైద్య, న్యాయ, కౌన్సెలింగ్‌, పునరావాసం పొందేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. బాధితులను వేర్వేరు శాఖలకు పంపకుండా సంబంధిత అధికారులు భరోసా కేంద్రానికే వచ్చి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల మధ్య సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని, ప్రతి నెల సమీక్ష నిర్వహించి బాధితులకు న్యాయం అందించడంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పరిహారం, కేసుల పురోగతిపై చర్చించాలని సూచించారు. పోలీసు, మహిళా, శిశు సంక్షేమ, వైద్య, ఆరోగ్య, జిల్లా న్యాయసేవల సంస్థ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, చైల్డ్‌లైన్‌, కౌన్సెలర్లు తదితర భాగస్వామ్య సంస్థలు సమష్టిగా పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని పేర్కొన్నారు. చిన్నారుల కేసుల్లో అత్యంత సున్నితంగా వ్యవహరించాలని, బాధితుల పునరావాసం, విద్య, వైద్య సాయం, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భరోసా కేంద్రం సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాల్య వివాహాల నియంత్రణకు ముందస్తు ప్రచారం చేపట్టాలని, సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్‌, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ అశోక్‌ శ్యామల, పోలీసు అధికారులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement