● 25 నుంచి ఇంటింటి సర్వే..
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు ధ్రువీకరిస్తారని తెలిపారు. జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించివాటి పరిష్కారం అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు, ఫారం–6 అందజేస్తారని, వాటిని పూర్తిగా నింపి తిరిగి అందజేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని.. ఇవ్వని వారి పేర్లు ఉండవని స్పష్టం చేశారు. ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ పూర్తికావస్తుందని, మంగళవారం మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు తమ బీఎల్‌ఏలకు పార్టీ గుర్తింపు కార్డులు అందజేయాలని, బీఎల్వోలతో సమన్వయం చేసుకొని ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు. ఇకపై ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని... ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు మ్యాపింగ్, అన్‌న్‌మ్యాపింగ్ డేటాను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ అనంతరం ఆన్‌మ్యాపింగ్ కేసులపై విచారణ చేపట్టి అవసరమైన నోటీసులు జారీ చేస్తామని వివరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని.. రెండు చోట్ల ఓటరుగా నమోదైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజ్యలక్ష్మి, సి–సెక్షన్ అధికారి జయసుధ, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సలీం, బీజేపీ నాయకుడు రఘువీర్‌యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, అబ్దుల్ సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, సీపీఐ నాయకుడు కెంచె నారాయణ తదితరులు పాల్గొన్నారు.


