కోఆప్షన్ ఎవరికో..?
నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో కో–ఆప్షన్ పదవులపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పుర ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని, ఎన్నికల సమయంలో కష్టపడిన సీనియర్ నేతలు, ముస్లిం మైనార్టీలకు కో–ఆప్షన్ పదవులు ఇస్తామని అధికార, విపక్ష పార్టీలు సైతం బుజ్జగింపులు చేశాయి. మూడు పురపాలికల్లో అధికార పార్టీ వారే పాగా వేయగా.. జిల్లాకేంద్రంలో మాత్రం బీజేపీ పీఠం దక్కించుకుంది.
● ప్రధానంగా పుర పరిధిలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సమాజంలో తగిన ప్రాతినిథ్యంలేని మైనార్టీలకు పురపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ఈ పదవులను కట్టబెడతారు. కో–ఆప్షన్ సభ్యులు కౌన్సిలర్లతో కలిసి పుర సమావేశాల కు హాజరవుతారు. వీరి ఎంపికకు పాలకవర్గం కొ లువుదీరిన 45రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ పదవులు ఆశించిన పలువురు ఆశావహులు ప్రజాప్రతినిధులు, చైర్మన్ల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా జనరల్ కోటాకు చెందిన కో–ఆప్షన్ పదవులకు మాత్రమే గట్టి పోటీ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పుర చట్టం 2019 ప్రకారం..
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కో–ఆప్షన్ సభ్యులను నియమిస్తారు. వీరు కౌన్సిలర్లకు సమాన హోదా కలిగి ఉంటారు. గౌరవ వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో మాత్రం వీరికి ఓటుహక్కు ఉండదు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు 45 రోజుల్లోపు పుర కమిషనర్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మైనార్టీ కోటాలో పోటీపడేవారు తమ కుల ధ్రువీకరణ పత్రం జతచేస్తే పుర కమిషనర్ పరిశీలిస్తారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే కౌన్సిలర్లతో చేతులు ఎత్తడంతో పాటు రహస్య ఓటింగ్ నిర్వహించాలనే నిబంధన ఉంది. పాలకవర్గం ఉన్నంత వరకు వీరు పదవుల్లో కొనసాగుతారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.
నలుగురికి అవకాశం..
మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో నలుగురిని కో–ఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు (ఒక పురుషుడు, ఒక మహిళ), క్రిస్టియన్ మైనార్టీ, జనరల్, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్లు కేటగిరీల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో కేటగిరి నుంచి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
పురపాలికల వారీగా ఇలా..
సీఎం ఇలాఖాలోని కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోస్గిలో ఆశావహులు తమ పేర్లు బయటకు వస్తే మరొకరు పోటీపడతారనే ప్రచారంతో బయటకు తెలియకుండా తెర వెనుక పావులు కదుపుతున్నారు.
మద్దూరు మున్సిపాలిటీలో జనరల్ కేటగిరిలో కుడుగుంట నర్సింహులు, గణప రవి, రాజ్‌కుమార్, గణప శ్రీనివాస్, కుక్కల బాలరాజు, జంగం బాబు, కూనె సంజీవ్‌కుమార్, బజారి మల్లికార్జున్, చందు, జీడీ రామకృష్ణ, గుత్తి పురుషోత్తం, ముస్లిం మైనార్టీ కేటగిరిలో రహీం, గాజుల ఉస్మాన్, డా. తాజుద్దీన్ రెనివట్ల, రియాజ్, యాసిన్, పింజరి హుస్సేన్, అహ్మద్, గులాం రసూల్, బల్లి సలాం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఒకరు మహిళకు అవకాశం ఉండటంతో వారి సతీమణులకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలోని మక్తల్ మున్సిపాలిటీలో అస్మద్దీన్, శంషోద్దీన్, అబ్దుల్ రహమాన్, నాగరాజు, శివశంకర్, మీనన్, సలాంతో పాటు పలువురు తెర వెనుక పావులు కదుపుతున్నారు. మంత్రి ‘ఆప్షన్’ ఎవరికి ఇస్తారోనన్న చర్చ కొనసాగుతోంది.
నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీకై వసం చేసుకోవడంతో ఆ పార్టీలోని ఆశావహులు పోటాపోటీగా తమకే అవకాశం ఇవ్వాలంటూ బడా నాయకులతో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తాము గెలిచే అవకాశం ఉన్నా.. పార్టీ అధిష్టానం చెప్పినందుకు సీట్లు వదులుకున్నామని.. తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మాజీ కౌన్సిలర్ అనసూయ భర్త 1వ వార్డుకు చెందిన బీజేపీ యువ నాయకుడు చిన్న రఘు, 4వ వార్డులో మాజీ కౌన్సిలర్ జయశ్రీ భర్త విజయ్ నవుతే పాటు ముస్లిం మైనార్టీలు పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం
కౌన్సిలర్‌తో సమాన హోదా
ఆశావహుల్లో ఉత్కంఠ
కొలువుదీరిన పాలకవర్గాలు
45 రోజుల్లోపు నోటిఫికేషన్.. ఎన్నిక
కోఆప్షన్ ఎవరికో..?


