ప్రజలు మెచ్చే పాలన అందించాలి
● సర్పంచుల శిక్షణా శిబిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపించారని.. వారు మెచ్చే విధంగా ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణకేంద్రంలో కొనసాగుతున్న మూడోవిడత సర్పంచుల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆమె ఎస్పీ డా. వినీత్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్ అనేది కేవలం పదవి మాత్రమే కాదని, బాధ్యత, కర్తవ్యమని తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛత, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు తదితర మౌలిక వసతులు కల్పించి ఆదర్శంగా నిలవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. శిక్షణ తరగతులకు చాలామంది సర్పంచులు గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు శిక్షణకు హాజరుకాకపోతే ఎలాగని.. జాతరలు, పండగలు అంటూ గైర్హాజరు కావడం సబబు కాదన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని చాలాగ్రామాల్లో నేటికీ ప్రజలు బహిర్భూమికి వెళ్తున్నట్లు మంత్రి చాలా సందర్భాల్లో చెప్పారని.. మరుగుదొడ్లు వినియోగించుకునేలా సర్పంచులు చైతన్యం తీసుకురావాలని సూచించారు. అవసరమైతే సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలకు సహకారం అందించాలని కోరారు. ఇళ్లులేని పేదలను గుర్తించి ఎంపీడీఓల వద్ద పేర్లు రాయిస్తే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసానిచ్చారు. పాలనను పరిశీలించేందుకు త్వరలోనే గ్రామాలను సందర్శిస్తానని ప్రకటించారు.
గ్రామాభివృద్ధికి పాటుపడాలి..
దేశ జనాభాలో 2.60 లక్షల మంది సర్పంచులు ఉన్నారని.. తమ గ్రామాలకు పెద్ద దిక్కులా ఉండి గ్రామాభివృద్ధికి పాటు పడాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలంటే నిధులు తప్పనిసరి అని.. ఎలాంటి నిధులు, ఖర్చు లేకుండా బాల్య వివాహాలు, కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని, ఘర్షణలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రతను బాధ్యతగా తీసుకోవాలని.. ఇకపై గ్రామపంచాయతీ కార్యాలయాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్, గ్రామ పోలీసు అధికారి, షీటీమ్ నంబర్లను రాసి ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలు, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


